Spy Satellite : ఉద్రిక్తతలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉత్తర కొరియా మారిపోయింది. వచ్చే వారం ఉత్తర కొరియా ప్రయోగించబోయే స్పై శాటిలైట్ (గూఢచార ఉపగ్రహం)పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. నవంబరు 22 నుంచి డిసెంబరు 1 మధ్య ఏ క్షణమైనా స్పై శాటిలైట్‌ను ఉత్తర కొరియా ప్రయోగించనుందని తెలుస్తోంది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు రెండుసార్లు స్పై శాటిలైట్‌ను ప్రయోగించేందుకు ఉత్తర కొరియా చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. అయినా పట్టు వీడకుండా మళ్లీ ఈ వారంలో ఇంకోసారి ఆ ప్రయోగం చేసేందుకు ఉత్తర కొరియా రెడీ అవుతోంది. ఈ స్పై శాటిలైట్ ద్వారా పొరుగుదేశం దక్షిణ కొరియాలోని సైనిక మోహరింపు, సముద్ర తీరంలో అమెరికా యుద్ధ నౌకల యాక్టివిటీని ఉత్తర కొరియా సైన్యం ట్రాక్ చేయగలుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఉత్తర కొరియా స్పై శాటిలైట్ వల్ల తమ భద్రతకు విఘాతం కలుగుతుందని పొరుగుదేశం దక్షిణ కొరియా వాదిస్తోంది. వెంటనే ఈ ప్రయోగాన్ని ఆపేయాలని వార్నింగ్ ఇస్తోంది. అవసరమైతే తమ ఆర్మీ ఉత్తర కొరియాలోకి ప్రవేశించి తగిన చర్యలు తీసుకుంటుందని దక్షిణ కొరియా ప్రకటించింది. 2016లో మొదటిసారిగా అణు పరీక్షను కూడా ఉత్తర కొరియా నిర్వహించింది. అణు పరీక్షలు చేయడానికి వెరవని ఉత్తర కొరియా.. స్పై శాటిలైట్ ప్రయోగాన్ని వాయిదా వేసే ఛాన్సే ఉండదని పరిశీలకులు అంటున్నారు. ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు తీసుకొని.. శాటిలైట్ టెక్నాలజీని, మిస్సైల్ టెక్నాలజీని రష్యా బదిలీ చేస్తోందని అమెరికా వాదిస్తోంది. దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలు అక్కడి సముద్రతీరంలో మోహరించి ఉన్నాయి. తమ మిత్రదేశం దక్షిణ కొరియాను రక్షించుకుంటామని అమెరికా అంటోంది. ఓ వైపు దక్షిణ కొరియాకు అమెరికా.. మరోవైపు ఉత్తర కొరియాకు రష్యా మద్దతుగా నిలుస్తూ, ఆయుధాలు సరఫరా చేస్తూ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయనే విమర్శలు(Spy Satellite) ఉన్నాయి.