Site icon HashtagU Telugu

North Korea Missile:జపాన్ మీదుగా దూసుకెళ్లిన ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ..అండర్ గ్రౌండ్ లో దాచుకోవాలంటూ ప్రజలకు సూచన!!

Rocket

Rocket

ఉత్తర కొరియా మరోసారి జపాన్ ను కవ్వించింది.ఉత్తర కొరియా ప్రయోగించిన ఒక బాలిస్టిక్ క్షిపణి ఈశాన్య జపాన్ లోని తోహోకు ప్రాంత గగన తలం పైనుంచి మంగళవారం దూసుకెళ్లింది. దీంతో ఆ ప్రాంతంలో నివసించే జపాన్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.చివరకు ఆ మిస్సైల్ జపాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ వెలుప‌ల ఉండే స‌ముద్రంలో ప‌డిందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ వివరాలను జ‌పాన్ ప్ర‌భుత్వం కూడా ధృవీక‌రించింది.

జపాన్ మిస్సైల్ జె-అలర్ట్ సిస్టమ్ యాక్టివ్

ఉత్తర కొరియా మిస్సైల్ ప్రవేశంతో జపాన్ లోని మిస్సైల్ జె-అలర్ట్ సిస్టమ్ ఒక్క సారిగా యాక్టివ్ అయ్యింది. జపాన్ లోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నివాసితులను జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అక్కడి ప్రభుత్వం వెంటనే హెచ్చరించింది.
ద‌య‌చేసి ప్ర‌జ‌లు భూగ‌ర్భం, భ‌వ‌నాల్లోకి వెళ్లి త‌ల‌దాచుకోవాల‌ని అందులో కోరింది. చివరకు ఆ మిస్సైల్ సముద్రంలో పడటంతో..
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం వల్ల తమ దేశానికి ఎలాంటి నష్టం జరగలేదని, ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా వెల్లడించారు. దీనిని ఉత్తర కొరియా హింసాత్మ‌క చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.  ఈ పరిణామం పై ఉత్తర కొరియా దాయాది దేశం దక్షిణ కొరియా కూడా స్పందించింది . ఉత్తర కొరియా తూర్పు వైపున గుర్తు తెలియని బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎందుకు.. ఏమిటి ?

అణ్వాయుధాలు కలిగి ఉన్న ఉత్తర కొరియా ఈ ఏడాది రికార్డు స్థాయిలో మిస్సైల్ పరీక్షలు నిర్వహించింది.గతవారం నాలుగుసార్లు స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ మిస్సైల్‌ను పరీక్షించింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌ కలిసి ఇటీవల సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడంపైనా ఉత్తర కొరియా ఆగ్రహంగా ఉంది.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ దక్షిణ కొరియా లో
పర్యటించడంపై ఆగ్రహానికి గురైన ఉత్తర కొరియా వరుసగా క్షిపణులను పరీక్షిస్తున్నది. అయితే, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మరో అణు పరీక్షకు సిద్ధమవుతున్నారని దక్షిణ కొరియా, అమెరికా వర్గాలు గత కొద్ది నెలలుగా హెచ్చరిస్తున్నాయి. అక్టోబర్‌ 16 తర్వాత మరో అణు పరీక్ష ను ఉత్తర కొరియా నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు.