North Korea : దక్షిణ కొరియా బార్డర్‌లో ఉత్తర కొరియా ఆర్మీ కవ్వింపులకు దిగుతోంది. రాత్రివేళల్లో లౌడ్ స్పీకర్లతో భారీ శబ్దాలు చేస్తూ సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలు, సైనికులకు ప్రశాంతమైన నిద్రలేకుండా చేస్తోంది. నక్కల ఊలలు, లోహాల గ్రైండింగ్ కలగలిస్తే ఎలాంటి సౌండ్స్ వస్తాయో.. అలాంటి సౌండ్స్‌ను రాత్రి టైంలో వింటున్నామని దక్షిణ కొరియాలోని సరిహద్దు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఉత్తర కొరియా(North Korea) ఆర్మీ ఎందుకిలా చేస్తోందో తమకు అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. ఆ సౌండ్స్ వినీవినీ తమకు చెవులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఈ సౌండ్ వార్‌ను ఆపాలని ఉత్తరకొరియాను దక్షిణ కొరియా వాసులు కోరుతున్నారు.
ఉత్తర కొరియా ఆర్మీ బార్డర్‌లో ఆయుధాలు, రాకెట్ లాంచర్లు, మిస్సైళ్లు, తోపులతో పాటు సౌండ్ సిస్టమ్‌లను కూడా అమర్చింది. బార్డర్‌లోని కొండలు, గుట్టలపై పెద్దసంఖ్యలో సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఉత్తర కొరియా ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడల్లా.. బార్డర్‌లో విధుల్లో ఉండే సైనికులు ఆయా సౌండ్ సిస్టమ్స్‌ను ఆన్ చేసి వదిలేస్తుంటారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మానసిక స్థితికి.. అతడి సైన్యం వ్యవహార శైలి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :Edible Oils : ‘మలేషియా’ ఎఫెక్ట్.. వంట నూనెల ధరల మంట
1950 నుంచి 1953 మధ్యకాలంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య యుద్ధం జరిగింది. అయితే ఒప్పందం వల్ల ఆ యుద్ధం ముగిసింది. ఈసారి ఒకవేళ యుద్ధం జరిగితే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇరుదేశాల వద్ద శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. ఉత్తర కొరియాకు అణ్వస్త్ర దేశం రష్యా మద్దతు ఉంది. ఉత్తర కొరియాలో ఇప్పటికే అణ్వాయుధాలు ఉన్నాయని అంటున్నారు. ఇక దక్షిణ కొరియాకు అమెరికా మద్దతు ఉండనే ఉంది. ఇప్పటికే అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన యుద్ధ నౌకలను కొరియా ద్వీపకల్ప సముద్ర జలాల్లో అమెరికా మోహరించింది. ఉత్తర కొరియా కవ్వింపులతో దక్షిణ కొరియా అసహనానికి గురైన రోజు యుద్ధం మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు.