చైనాలో నోరో వైరస్ కలకలం..వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థత

స్కూలులో చదువుతున్న వంద మందికి పైగా విద్యార్థులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో వైద్యాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. విద్యార్థులపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో మొత్తం 103 మందికి నోరో వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

Published By: HashtagU Telugu Desk
Norovirus outbreak in China, over a hundred students fall ill

Norovirus outbreak in China, over a hundred students fall ill

. బాధితుల ఆరోగ్యంపై నిఘా

. నోరో వైరస్ లక్షణాలు.. వ్యాప్తి

. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం

Norovirus: చైనాలోని ఓ స్కూలులో నోరో వైరస్ ఒక్కసారిగా విజృంభించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. స్కూలులో చదువుతున్న వంద మందికి పైగా విద్యార్థులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో వైద్యాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. విద్యార్థులపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో మొత్తం 103 మందికి నోరో వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అధికార యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టి స్కూలు క్లాస్‌రూమ్‌లు, కారిడార్లు, ఆవరణ అంతటా వైరస్‌ను నిర్మూలించే ప్రత్యేక మందులను పిచికారీ చేసింది. బాధిత విద్యార్థులకు తక్షణ చికిత్స అందించడంతో పాటు మిగతా విద్యార్థులకు వైరస్ వ్యాప్తి చెందకుండా కఠినమైన జాగ్రత్తలు అమలు చేసింది.

వైరస్ బారిన పడిన విద్యార్థులందరూ క్రమంగా కోలుకుంటున్నారని వైద్యాధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ ప్రత్యేక హాజరు రిజిస్టర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా స్వల్ప లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేపడుతున్నామని చెప్పారు. అంతేకాకుండా స్కూలు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులకు కూడా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈ చర్యలతో వైరస్ స్కూలు పరిమితుల్లోనే నియంత్రణలోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ డిసీజ్ కంట్రోల్ విభాగం ఈ ఘటనపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది.

ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి మధ్య నోరో వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ బారిన పడినవారిలో ప్రధానంగా వాంతులు, విరేచనాలు, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది సాధారణ వైరస్ అయినప్పటికీ వ్యాప్తి వేగం చాలా ఎక్కువగా ఉండటమే ప్రధాన ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. నోరో వైరస్‌ను తొలిసారిగా 1968లో అమెరికాలోని ఓహియో రాష్ట్రం నార్‌వాక్ పట్టణంలోని ఓ స్కూలులో గుర్తించారు. ఆ ప్రాంతం పేరుతోనే ఈ వైరస్‌కు “నోరో వైరస్” అనే పేరు వచ్చింది. ముఖ్యంగా కలుషిత ఆహారం, నీటి ద్వారా ఇది వేగంగా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 68.5 కోట్ల మంది నోరో వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో ఐదేళ్లలోపు చిన్నారులే దాదాపు 20 కోట్ల మంది ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 20 లక్షల మంది మృతి చెందుతున్నారని అందులో 50 వేల మంది చిన్నారులు ఉన్నారని అంచనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలోని తాజా ఘటన మరింత అప్రమత్తత అవసరమని సూచిస్తోంది. పరిశుభ్రత, శుభ్రమైన ఆహారం, వ్యక్తిగత జాగ్రత్తల ద్వారానే నోరో వైరస్ వంటి వ్యాధులను నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

 

  Last Updated: 17 Jan 2026, 10:04 PM IST