John Fossey : నార్వే రచయిత జాన్ ఫోసేకు నోబెల్ బహుమతి

2023 సంవత్సరానికి సాహిత్యంలో నార్వే రచయిత జాన్ వొలావ్ ఫోసే (John Fossey)ను నోబెల్ బహుమతి (Noble Prize) వరించింది.

  • Written By:
  • Updated On - October 6, 2023 / 10:46 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Norwegian writer John Fossey : 2023 సంవత్సరానికి సాహిత్యంలో నార్వే రచయిత జాన్ వొలావ్ ఫోసే (John Fossey)ను నోబెల్ బహుమతి వరించింది. అతని రచనలను “మానవ స్థితికి అద్దం పట్టే లోతైన చిత్రణలు”గా అకాడమీ న్యాయ నిర్ణేతలు అభివర్ణించారు. గొంతులేని వాటికి ఆయన సాహిత్యం గొంతుగా మారిందని అకాడెమీ అభిప్రాయపడింది. ఫోసే 1959లో నార్వేలోని పశ్చిమ తీర ప్రాంతమైన హేగ్‌సండ్‌లో జన్మించారు. అతను 1983లో తన మొదటి నవల, “రెడ్, బ్లాక్”ను ప్రచురించారు. అప్పటి నుండి, అతను నవలలు, నాటకాలు, కవితలు, కథలు, వ్యాసాలు, పిల్లల పుస్తకాలతో సహా అనేక రకాల సాహిత్య రూపాలలో దాదాపు 40 గ్రంథాల ద్వారా తన రచనా వైభవాన్ని ప్రపంచానికి చాటారు. “సెప్టోలజీVI-VII’ రెండేళ్ళ క్రితం పూర్తి చేసిన గ్రంథం. ఇదే గ్రంథం నోబెల్ ప్రైజ్ షార్ట్ లిస్టులో చేరింది. ది అదర్ నేమ్ (2019),ఐ ఈజ్ అనదర్ (2020), ద న్యూ నేమ్ (2021) ఇలా ఇటీవలి కాలంలో వరస గ్రంథాలు వెలువరించి ప్రపంచ సాహిత్యానికి, నార్వే భాషకీ కొత్త చేర్పుని అందించారు.

ఫోసే (John Fossey) రచనలు తరచుగా మానవ మనస్తత్వంలోని వివిధ అంశాలను అన్వేషిస్తాయి. వీటిలో ప్రేమ, కోపం, ఒంటరితనం, మరణంలాంటి అంశాలు విశేషంగా కనిపిస్తాయి. అతని రచనలు చాలా శక్తివంతంగా, భావోద్వేగపూరితంగా ఉంటాయి. అవి పాఠకులపై శాశ్వతమైన ముద్ర వేస్తాయి. ఫోసే రచనల్ని ప్రపంచమంతా నిండుగా కౌగిలించుకుంది. ఎంతో శక్తివంతమైన ఆయన రచనలు ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులను గెలుచుకున్నాయి. వీటిలో 1997లో నార్వేజియన్ బుక్ అవార్డు, 2003లో ఫ్రాన్స్‌లోని హోనోర్స్ లిటరరీ అవార్డ్, 2012లో జర్మనీలోని హోఫ్మన్స్టాల్ సాహిత్య బహుమతి మొదలైనవి ముఖ్యంగా చెప్తారు.2023 సంవత్సరానికి గాను అతనికిప్పుడు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.నార్వే నుంచి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్న వారిలో ఫోసే నాలుగో సాహితీవేత్త. “రెడ్, బ్లాక్” (1983) తో పాటు “నాథన్ ది నావిగేటర్” (1996),”ఆమ్‌స్టెర్డామ్” (2003),”సెయిల్స్” (2009),”ఎ హౌస్ టు లీవ్ ఇన్” (2016) మొదలైనవి ఫోసే రచనల్లో విశేషమైనవిగా ప్రసిద్ధికెక్కాయి. ఆయన రచనలు దాదాపు నలభై ప్రపంచ బాషల్లో అనువాదమయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఆయన నాటకాలు ఇప్పటికే వేయికి పైగా ప్రచురణలు పొందాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడిన నాటకాలు రాసిన గొప్ప రచయితల్లో ఫోసే ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పద్యాన్నీ గద్యాన్నీ వేయి చేతులతో రచించిన మహా రచయిత ఫోసే. అయితే ఆయన ప్రోజ్ రైటర్ గా మాత్రం అనంత కీర్తిని ఆర్జించారనే చెప్పాలి. ఫోసే (John Fossey) రచనల్లో “ఎ న్యూ నేమ్ సెప్టాలజీ VI-VII” అనేది మేగ్నమ్ ఓపస్ గా నోబెల్ సాహిత్య కమిటీ చైర్ పర్సన్ ఆండెర్స్ వోల్సన్ అభివర్ణించడం ఇక్కడ మనం విశేషంగా గుర్తించాలి. మానవాళిలోని వ్యతిరేక ధోరణులను ప్రముఖంగా ప్రదర్శించిన తన పూర్వీకుల శైలిని ఆయన కొంత పంచుకున్నప్పటికీ ప్రపంచాన్ని ఒక నిహిలిస్ట్ దృష్టితో ఫోసే చూసాడని చెప్పలేం అని స్వీడిష్ అకాడెమీ అభిప్రాయపడింది. మావవ అనుభవసారంలోంచి పిండి తీసిన ఆయన సాహిత్య సృష్టిలో హాస్యంతో కూడిన అద్భుత స్పందనలు మనల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అతని శైలిని ఫోసే మినిమలిజం అని అంటారు. దీనికి పరమోదాహరణగా “స్టెండ్ గిటార్ (1985)” నవలను ఉదహరిస్తారు. మొత్తం ఆయన రచనల్లో మానవ స్థితిగతులే కేంద్రస్థానంలో ఉంటాయి.

ప్రకృతి, భాషా కలగలిసిన నార్వే నేపథ్యం నుంచి తన సాహిత్య భాషను సృష్టించుకున్నాడు ఫోసే. తన భాషను భౌగోళికంగా మేళవించి ఆధునిక కళాత్మక టెక్నిక్ తో రచనలు చేసాడు. ఫోసే వాడేది ‘ కొత్త నార్వే భాష’ గా చెప్తారు. నార్వే ప్రజల్లో కేవలం పది శాతం మంది మాత్రమే ఈ భాషలో మాట్లాడతారట. తనకు వచ్చిన ఈ నోబెల్ బహుమతి తన భాషకు, ఆ భాషోద్యమానికి వచ్చిన బహుమతిగా భావిస్తున్నట్టు 64 సంవత్సరాల ఈ నార్వే రచయిత అన్నారు. అయితే ఇది మొత్తంగా సాహిత్యానికి దక్కిన గౌరవమే అని కూడా అభివర్ణించారనుకోండి. మీరెలా ఫీలవుతున్నారని రాయిటర్ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ, చాలా ఆనందిస్తున్నాను, అదేక్రమంలో భయపడుతున్నాను” అని కూడా అన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు నార్వే భాషకు ఈ గౌరవం దక్కింది. ఇప్పుడు ఈ బహుమతి వచ్చినందుకు అమితోత్సాహంతో ఉన్నానంటూనే తాను ఈ వార్త వస్తుందని గత పదేళ్ళుగా ఎదురు చూస్తున్నాని చెప్పి తన సాధికారతను ప్రకటించుకున్నారు. మొత్తానికి ఒక దేశంలో ఒక స్థానిక మాండలికంలో రచనలు చేసిన వ్యక్తికి ఈ గౌరవం దక్కడం విశేషమే. గత ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారం ఫ్రెంచి రచయిత్రి ఆనీ ఎర్నాక్స్ కు దక్కింది.

సాహిత్య ప్రపంచమంతటితో పాటు మన తెలుగు సాహితీ ప్రియులం కూడా ఫోసేకు కంగ్రాట్స్ చెబుదాం.

Also Read:  Assembly Polls Schedule: ఈనెల 12న అసెంబ్లీ పోల్స్ షెడ్యూల్ ?