Elon Musk : ట్విట్టర్ యజమాని, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై రెండోసారి జరిగిన హత్యాయత్నంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఎన్నికల్లో బహిరంగ మద్దతును ప్రకటించిన ఎలాన్ మస్క్.. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్, ప్రస్తుత దేశాధ్యక్షుడు బైడెన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ‘‘కమల, బైడెన్‌లను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు ? కేవలం ట్రంప్‌నే చంపాలని భావిస్తున్నారు’’ అని మస్క్(Elon Musk) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ట్రంప్‌నే ఎందుకు చంపాలని అనుకుంటున్నారు అంటూ ఓ ఎక్స్ వినియోగదారుడు చేసిన పోస్టుపై స్పందిస్తూ ఈమేరకు మస్క్ కామెంట్స్ పెట్టారు.
Also Read :Trump Golf Course: ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం.. నిందితుడు ఎవరంటే ?
ట్రంప్‌పై జరిగిన మరో హత్యాయత్నంపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి సైతం స్పందించారు. ట్రంప్ ఈ హత్యాయత్నం నుంచి సేఫ్‌గా బయటపడినందుకు ఆ భగవంతుడికి థ్యాంక్స్ అంటూ ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అమెరికాలో రాజకీయ హింసకు యత్నాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు దేశంలో తావు ఉండకూడదని వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. కనీసం ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సరిసమానమైన భద్రతను ట్రంప్‌కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ ఏడాది జులైలో పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. లక్కీగా బుల్లెట్లు ఆయన చెవిలోకి దూసుకెళ్లాయి. ఒకవేళ అవి మెదడు భాగం లేదా ఛాతీ భాగంలోకి వెళ్లి ఉంటే ట్రంప్ ప్రాణాలపైకి వచ్చి ఉండేది. ఆనాడు కాల్పులు జరిపిన వ్యక్తిని థామస్ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు.