నేపాల్ ప్రెసిడెంట్ (Nepal President) రామచంద్ర పౌడెల్ శనివారం రాత్రి కడుపునొప్పితో ఖాట్మండులోని త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్‌లో చేరారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో.. అధ్యక్షుడు పౌడెల్ శనివారం అర్థరాత్రి ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా 78 ఏళ్ల పౌడెల్ రెండు వారాల క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. గత నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామచంద్ర పౌడెల్‌కు 33,802 ఓట్లు వచ్చాయి. పౌడెల్‌కు 214 మంది పార్లమెంటు సభ్యులు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల మద్దతు ఉంది. ఎనిమిది పార్టీల కూటమికి పౌడెల్ ఉమ్మడి అభ్యర్థి. వీటిలో నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్ట్ సెంటర్ (CPN-మావోయిస్ట్ సెంటర్) ఉన్నాయి.
Also Read: Devastating Tornadoes: అమెరికాలో మరోసారి టోర్నడోల విధ్వంసం.. 18 మంది మృతి.. ఇళ్లు ధ్వంసం
1944 అక్టోబరు 14న బహున్‌పోఖ్రీలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన పౌడెల్ చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చారు. అతను 1970లో నేపాలీ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అయిన నేపాల్ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడిగా మారాడు. 1980లో పౌడెల్.. నేపాలీ కాంగ్రెస్ (నిషేధించబడింది) తన్‌హున్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1987లో పదోన్నతి పొంది పార్టీ కేంద్ర కార్యవర్గంలో చోటు కల్పించారు. అదే ఏడాది పార్టీ ప్రచార కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. 2005లో పౌడెల్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. 2007లో పార్టీ ఉపాధ్యక్షుడయ్యాడు. 2015లో తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు.