Site icon HashtagU Telugu

Expensive City: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏదో తెలుసా.. అక్కడ ప్రతిదీ ఖరీదైనదే?

Expensive City

Expensive City

ప్రపంచవ్యాప్తంగా ప్రవాసులు నివసించడానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ నిలిచింది. అయితే గతంలో ఈ స్థానంలో ఉన్న హాంకాంగ్ రెండవ స్థానానికి చేరుకుంది. మరొకవైపు అద్దెలు బాగా పెరిగిపోవడంతో సింగపూర్ ఈ జాబితాలో టాప్ ఫైవ్ లో నిలిచింది. అధిక ద్రవ్యోల్బణం, అద్దెలు పెరగడమే న్యూయార్క్‌ లో ప్రవాసులు నివసించడం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిందని ఈసీఏ ఇంటర్నేషనల్స్‌ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ర్యాంకింగ్స్‌ 2023 నివేదిక తెలిపింది.

జెనీవా, లండన్‌ ఈ జాబితాలో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది 13వ స్థానంలో ఉన్న సింగపూర్‌ ఈసారి ఏకంగా తొలి ఐదు నగరాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. సాధారణంగా ఆసియా నగరాలు ఈ జాబితాలో కిందకు వెళుతూ ఉంటాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడమే దీనికి కారణం. అయితే ఈసారి ట్రెండ్‌కు భిన్నంగా సింగపూర్‌ పైకి ఎగబాకింది. ఈ జాబితాలో ఇస్తాంబుల్‌ ఏకంగా 95 స్థానాలు పైకి ఎగబాకి 108వ స్థానంలో నిలిచింది. అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ఆర్థిక విధానాల వల్ల ఇటీవల టర్కీలో ధరలు 80 శాతం పెరిగాయి.

ఇదే ఇస్తాంబుల్‌ తక్కువ సమయంలో ఖరీదైన నగరంగా మారడానికి దోహదం చేసింది. వినియోగ వస్తువులు, సేవల ధరలు, అద్దెలను ఆధారంగా చేసుకొని ఈసీఏ ఇంటర్నేషనల్‌ ఈ జాబితాను సిద్ధంగా చేస్తుంది. 120 దేశాల్లోని మొత్తం 207 నగరాలకు ర్యాంకులను కేటాయిస్తోంది. రష్యా నుంచి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌లో అద్దెలు దాదాపు 33 శాతం పెరిగాయి. దీంతో ఈ నగరం జాబితాలో 12వ స్థానంలో నిలిచింది. ఐరోపాకు చెందిన చాలా నగరాలు ఈ జాబితాలో పైకి ఎగబాకాయి. కానీ, నార్వే, స్వీడన్‌ సిటీలు మాత్రం బలహీన కరెన్సీల కారణంగా కిందకు దిగజారాయి. తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా ఫ్రాన్స్‌ నగరాలు సైతం ఖరీదైన నగరాల జాబితాలో కిందకు వెళ్లాయి.