Green Card : అమెరికాలో శాశ్వత నివాసం (Green Card) కోసం వివాహం ఆధారంగా దరఖాస్తు చేసుకునే వారికి పెద్ద షాక్ లాంటి పరిణామం. అమెరికా పౌరసత్వం మరియు వలస సేవల విభాగం (USCIS) తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఇకపై వివాహ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై మరింత కఠినంగా పరిశీలన జరగనుంది. మోసపూరిత వివాహాలను అడ్డుకునేందుకు, అలాగే గ్రీన్ కార్డ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఈ కొత్త నిబంధనలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
తప్పనిసరిగా ఇంటర్వ్యూకు హాజరవ్వాలి
ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం, గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసిన ప్రతి జంట తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. అంతేకాదు, వారి బంధం నిజమైనదేనని నిరూపించేందుకు పలు రకాల బలమైన ఆధారాలను సమర్పించాల్సినవి ఇవే.
. జంటగా దిగిన ఫోటోలు
. ఉమ్మడి బ్యాంకు ఖాతాల సమాచారం
. ఇంటి అద్దె లేదా ఆస్తి పత్రాలు
. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి వచ్చిన ప్రమాణ పత్రాలు (అఫిడవిట్లు)
. వీటిని పూర్తిగా, నిజాయతీగా సమర్పించడమే కాకుండా, ఏదైనా అనుమానం కలిగే స్థితి వస్తే, USCIS అధికారులు మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంది.
తాత్కాలిక వీసాదారులపై ప్రత్యేక దృష్టి
ఇప్పటికే అమెరికాలో H-1B వంటి తాత్కాలిక వీసాలపై ఉన్నవారు, వివాహం ద్వారా శాశ్వత నివాస హక్కు పొందాలని చూస్తున్న వారిపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. దరఖాస్తుదారుల ఇమ్మిగ్రేషన్ చరిత్రను పూర్తిగా విశ్లేషిస్తారు. గతంలో ఒకే వ్యక్తి వేర్వేరు వ్యక్తుల పేరుతో స్పాన్సర్ చేశారా? అనే కోణంలోనూ విచారణ ఉంటుంది. ఈ పరిణామం వల్ల దరఖాస్తుదారులకు గట్టి పరీక్ష ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ కార్డ్ మంజూరు అయినా దేశం విడిచిపోవాల్సి వస్తుందా?
ఈ మార్పులలో అత్యంత కీలకమైన అంశం – ఒకవేళ గ్రీన్ కార్డ్ మంజూరు అయినా, దరఖాస్తుదారుడు దేశంలో ఉండటానికి అనర్హుడని తేలితే, నోటీస్ టు అప్పియర్ (NTA) జారీ చేసే అధికారం USCIS అధికారులకు ఉంటుంది. అంటే, వ్యక్తిని అమెరికా వదిలి వెళ్లమని ఆదేశించే అవకాశం ఉంది. ఇది ప్రజా భద్రత దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం అని USCIS స్పష్టం చేసింది.
అప్రమత్తంగా ఉండాలి – న్యాయవాదుల సూచన
ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఈ మార్పులను తీవ్రంగా పరిశీలిస్తున్నారు. పాత ఫారాలను వాడటం, అసంపూర్తి సమాచారం ఇవ్వడం వంటి చిన్న తప్పులు కూడా గ్రీన్ కార్డ్ దరఖాస్తును తిరస్కరించే ప్రమాదం కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల దరఖాస్తుదారులు తప్పక నిపుణులైన వలస న్యాయవాదుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశమూ
ఈ కఠిన నిబంధనలు గ్రీన్ కార్డ్ ప్రక్రియను మరింత జాప్యం చేయవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎదురుచూస్తున్న వలసదారుల్లో కొన్ని కుటుంబాలు ఈ కొత్త మార్పులతో ఆందోళనకు గురవుతున్నాయి. కానీ, USCIS మాత్రం తమ చర్యలు వలస విధానంపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకే అని వాదిస్తోంది. కాగా, అమెరికాలో వివాహం ద్వారా శాశ్వత నివాసం పొందాలనుకునే వారు ఇకపై మరింత అప్రమత్తంగా, పూర్తిస్థాయి ఆధారాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న పొరపాటు పెద్ద ఇబ్బందికి దారి తీయవచ్చు.
Read Also: DK Shivakumar : మరోసారి సిద్ధరామయ్యతో విభేదాలను బయటపెట్టిన డీకే..సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు