. వీసా బాండ్ అంటే ఏమిటి? ఎవరికీ వర్తిస్తుంది?
. బాండ్ మొత్తం ఎలా నిర్ణయిస్తారు? చెల్లింపు విధానం ఏంటి?
. ప్రయాణ నిబంధనలు, బాండ్ రీఫండ్ ఎప్పుడు?
US Visa: అమెరికాకు వెళ్లాలని భావిస్తున్న విదేశీ పౌరులకు ముఖ్యంగా బిజినెస్ (B1), టూరిస్ట్ (B2) వీసాలపై ప్రయాణించే వారికి అమెరికా విదేశాంగ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వీసా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఎంపిక చేసిన దేశాల పౌరుల కోసం ‘వీసా బాండ్’ అనే కొత్త విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త విధానం ప్రకారం ఎంపిక చేసిన దేశాల పౌరులు అమెరికా వీసా పొందాలంటే ముందుగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని బాండ్‌గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ మొత్తం 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల వరకు ఉండవచ్చు. భారతీయ కరెన్సీలో చూస్తే ఇది సుమారు రూ.4.5 లక్షల నుంచి రూ.13.6 లక్షల వరకు ఉంటుంది. ఈ పైలట్ ప్రోగ్రామ్‌లో మొత్తం 38 దేశాలను అమెరికా గుర్తించింది. ఇందులో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, నైజీరియా, ఉగాండా, క్యూబా, వెనిజులా, జాంబియా, జింబాబ్వే, తజికిస్థాన్, టాంజానియా, ఫిజీ వంటి దేశాలు ఉన్నాయి.
అయితే ఈ జాబితాలో భారత్ పేరు లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ నిబంధన భారతీయులకు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. వీసా ఇంటర్వ్యూ సమయంలో కాన్సులేట్ అధికారి దరఖాస్తుదారుడి ప్రొఫైల్‌ను పరిశీలిస్తారు. ప్రయాణ ఉద్దేశం ఆర్థిక స్థితి గత ప్రయాణ చరిత్ర వంటి అంశాల ఆధారంగా బాండ్ అవసరమా? లేక అవసరం లేదా? అనే నిర్ణయం తీసుకుంటారు. బాండ్ అవసరమని భావిస్తే, 5,000, 10,000 లేదా 15,000 డాలర్లలో ఏ మొత్తాన్ని చెల్లించాలో కూడా అధికారి నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రమే దరఖాస్తుదారుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన ఫారం I-352ను పూర్తి చేసి, యూఎస్ ట్రెజరీ అధికారిక ప్లాట్‌ఫామ్ ద్వారానే బాండ్ మొత్తాన్ని చెల్లించాలి. ఇతర థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల ద్వారా చెల్లింపులు చేస్తే ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదు. కాన్సులర్ అధికారి సూచన లేకుండా ముందే బాండ్ చెల్లించినా ఆ మొత్తం తిరిగి రాదని స్పష్టం చేసింది. అంతేకాదు బాండ్ చెల్లించినంత మాత్రాన వీసా ఖచ్చితంగా వస్తుందన్న హామీ కూడా లేదు.
బాండ్ చెల్లించి వీసా పొందిన వారు అమెరికాకు వెళ్లేటప్పుడు తిరిగి వచ్చినప్పుడు ప్రభుత్వం గుర్తించిన విమానాశ్రయాల ద్వారానే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోస్టన్ లోగాన్, న్యూయార్క్ జేఎఫ్‌కే, వాషింగ్టన్ డల్లెస్ (IAD) విమానాశ్రయాలను మాత్రమే అనుమతిస్తున్నారు. త్వరలో నెవార్క్, అట్లాంటా, చికాగో ఓ’హేర్, లాస్ ఏంజిల్స్ వంటి ఎయిర్‌పోర్టులను కూడా ఈ జాబితాలో చేర్చనున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే అమెరికాలో ప్రవేశాన్ని నిరాకరించే అవకాశం ఉంది. వీసా గడువులోగా అమెరికాను విడిచి వెళ్లినట్లయితే బాండ్ మొత్తం ఆటోమేటిక్‌గా తిరిగి చెల్లిస్తారు. కానీ ఓవర్‌స్టే చేయడం అక్రమంగా ఇమ్మిగ్రేషన్ స్టేటస్ మార్చేందుకు ప్రయత్నించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే బాండ్ మొత్తాన్ని ప్రభుత్వం జప్తు చేస్తుంది. వీసా మినహాయింపు కార్యక్రమం (Visa Waiver Program)లో ఉన్న దేశాల పౌరులకు ఈ కొత్త బాండ్ విధానం వర్తించదని అధికారులు తేల్చిచెప్పారు.
