Bondi Beach: ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ బాండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై ఆ దేశ ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆయన యూదు సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఉగ్రవాద శక్తులు ఆస్ట్రేలియా సమాజాన్ని విభజించడాన్ని తన ప్రభుత్వం ఎప్పటికీ అనుమతించబోదని ఆయన స్పష్టం చేశారు.
అసలేం జరిగింది?
డిసెంబర్ 14న బాండీ బీచ్‌లో హనుక్కా పండుగను జరుపుకుంటున్న యూదు సమాజంపై తండ్రీకొడుకులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి ఆస్ట్రేలియా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపణలు
ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెన్జమిన్ నెతన్యాహు ఆస్ట్రేలియా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “ఆస్ట్రేలియా ప్రభుత్వం పాలస్తీనాను దేశంగా గుర్తించి ఉగ్రవాదానికి బహుమతి ఇచ్చింది. ఆ బలహీనతే ఈ దాడికి కారణమైంది” అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పాలస్తీనాను దేశంగా గుర్తించిన సంగతి తెలిసిందే.
Also Read: సరికొత్త అవతారంలో ‘రెనో డస్టర్’.. 2026 రిపబ్లిక్ డే రోజున గ్రాండ్ ఎంట్రీ!
ప్రధాని అల్బనీస్ ఘాటు సమాధానం
సోమవారం (డిసెంబర్ 22, 2025) విలేకరులతో మాట్లాడిన అల్బనీస్.. నెతన్యాహు ఆరోపణలను తోసిపుచ్చారు. పాలస్తీనాను గుర్తించడానికి, బాండీ బీచ్ దాడికి ఎటువంటి సంబంధం లేదు. ఈ దాడి వెనుక ISIS సిద్ధాంతం ఉంది. ఇది ఇస్లాం యొక్క వికృత రూపం అని ఆయన స్పష్టం చేశారు. నేరస్తులకు ఏ దేశ గుర్తింపుతోనూ పనిలేదు. వారు కేవలం ఖలీఫా రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది యూదు వ్యతిరేక భావజాలంతో చేసిన దాడి అని స్పష్టమవుతోంది అని ప్రధాని పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు
ఈ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో నాజీ సెల్యూట్ చేయడాన్ని నిషేధించనున్నారు. యూదు ప్రార్థనా స్థలాలు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద భద్రత కోసం నిధులను పెంచుతున్నట్లు ప్రకటించారు. దేశంలో గన్ లైసెన్సింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. ఉగ్రవాదం పట్ల ఆస్ట్రేలియా ఎప్పటికీ రాజీపడదని, ప్రజల మధ్య ఐక్యతను కాపాడటానికి శాయశక్తులా కృషి చేస్తామని అల్బనీస్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
