Russia Vs NATO : ఉక్రెయిన్ – రష్యా మధ్య గత కొన్నేళ్లుగా జరుగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపు దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా కీలక పరిణామం జరిగింది. పోలండ్.. నాటో కూటమి దేశం. పోలండ్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న ఓ ప్రాంతంపై రష్యా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే పోలండ్‌లో ఉన్న నాటో కూటమికి చెందిన సైనిక దళాలు అలర్ట్ అయ్యాయి. వెంటనే దాని యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి. పోలండ్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అలర్ట్ మోడ్‌లోకి వచ్చేశాయి.ఈ విషయాన్ని నాటో ఆపరేషనల్ కమాండ్ హెడ్‌క్వార్టర్ ప్రకటించింది.
Also Read :Haldiram – PepsiCo : హల్దీరామ్‌లోకి పెప్సీకో ఎంట్రీ.. వాటా కొనుగోలుకు చర్చలు
అసలు విషయం ఏమిటంటే.. ఉక్రెయిన్-పోలండ్ దేశాల సరిహద్దులు పక్కపక్కనే ఉంటాయి. పోలండ్ సరిహద్దుల్లో ఉక్రెయిన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రష్యా వైమానిక దాడులు చేసింది. ఈ బార్డర్‌లోని గ్యాస్, ఎరువుల సరఫరా(Russia Vs NATO) కేంద్రాలపై రష్యాకు చెందిన ఏడు టీయూ-22, ఆరు టీయూ-95 స్ట్రాటజిక్ బాంబర్ యుద్ధ విమానాలు బాంబులను జార విడిచాయి. ఇటీవలే రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు చేసింది. వాటికి ప్రతీకారంగానే రష్యా ఈ దాడి చేసిందని తెలిసింది.
Also Read :Meta Apology : భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్ కామెంట్స్ తప్పే.. సర్కారుకు మెటా కంపెనీ సారీ
రష్యాపై దాడులు చేసేందుకు బ్రిటన్ తయారుచేసిన స్ట్రామ్ షాడో, అమెరికా తయారు చేసిన ఏటీఏసీఎంఎస్ మిస్సైళ్లను ఉక్రెయిన్ వినియోగిస్తోంది. ఇవి రష్యాకు పెద్ద సవాలును విసురుతున్నాయి. మంగళవారం రోజు రష్యాపై ఉక్రెయిన్ 14 క్షిపణులు, 200 డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో తమ దేశంలోని కెమికల్ ఫ్యాక్టరీలు, విద్యుత్తు కేంద్రాలు దెబ్బతిన్నాయని రష్యా అంగీకరించింది. తాము 2 మిలియన్‌డాలర్ల విలువైన స్ట్రామ్ షాడో మిస్సైళ్లను కూల్చేశామని వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ దేశం వైపుగా వచ్చిన 40 రష్యా మిస్సైళ్లలో 30 కూల్చేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. నాటో దేశాల నుంచి వేగంగా తమకు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అందితే.. రష్యాపై మరింత భీకర దాడులు చేస్తామని ఆయన తెలిపారు. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్ నేషనల్ గ్రిడ్ పరిధిలో సమస్యలు వచ్చాయి. దీంతో దేశంలోని ఆరు ప్రదేశాల్లో అత్యవసర కరెంటు కోతలు విధిస్తున్నారు.