అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ప్రతిష్ఠాత్మక మూన్ మిషన్ వాయిదా పడింది. పవర్‌ఫుల్ రాకెట్ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి, హైడ్రోజన్ లీక్ అవ్వడంతో రాకెట్ లాంచ్ కౌంట్‌డౌన్‌ను మధ్యలో నిలిపివేసింది. ప్రయోగం తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామంటోంది నాసా.
50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమానికి ఆటంకాలు ఎదురయ్యాయి. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. ఇంధన ట్యాంకర్లో లీకేజీల కారణంగా పలుమార్లు అవాంతరాలు ఏర్పడ్డాయి.
ఆర్టెమిస్ ప్రయోగంలో భాగంగా రాకెట్‌లో 10లక్షల గ్యాలన్ల హైడ్రోజన్, ఆక్సిజన్ నింపాల్సి ఉంది. ఈ క్రమంలో నాలుగు ఇంజిన్‌లు ఉన్న ఈ రాకెట్‌లో ఒకదాని నుంచి ఇంధనం లీక్ అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. లీక్‌ను కంట్రోల్ చేసి ప్రయోగాన్ని నిర్వహించాలని నాసా ప్రయత్నించింది. అయితే అది సాధ్యంకాకపోవడంతో చివరికి రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఫ్లోరిడాలోని నాసా కెనెడీ అంతరిక్ష కేంద్రంలోని లాంచ్‌పాడ్‌కు దగ్గర్లో రెండురోజుల క్రితం ఐదు పిడుగులు పడ్డాయి. అయితే వీటి ప్రభావం వల్ల రాకెట్‌కు ఎలాంటి నష్టం జరగలేదని నాసా భావించింది. అయితే, ప్రయోగానికి గంటల ముందు రాకెట్ ఇంజన్ నుంచి ఇంధనం లీక్ అవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. నాలుగు ప్రధాన ఇంజిన్లు, పెద్ద ఇంధన ట్యాంకు ఉన్న ప్రాంతంలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ప్రయోగాన్ని నాసా వాయిదా వేసింది.