Chile Sinkhole: భూమి కుంగిపోయి.. 50 అంతస్తుల లోతైన గొయ్యి!!

అకస్మాత్తుగా ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. 656 అడుగుల (సుమారు 50 అంతస్తుల) లోతు, 82 అడుగుల వెడల్పుతో ఉన్న ఆ గొయ్యిని చూసి అందరూ నోరెళ్ళబెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 06:30 AM IST

అకస్మాత్తుగా ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. 656 అడుగుల (సుమారు 50 అంతస్తుల) లోతు, 82 అడుగుల వెడల్పుతో ఉన్న ఆ గొయ్యిని చూసి అందరూ నోరెళ్ళబెడుతున్నారు. చిలీలోని టియెరా అమరిల్లా నగరానికి సమీపంలో ఉన్నట్టుండి భూమి కుంగిపోయి.. ఈ గొయ్యి ఏర్పడింది. అది కూడా అల్కపెరోసా అనే గని పక్కనే కావడం గమనార్హం. గొయ్యి చుట్టూ సుమారు 100 మీటర్ల పరిధిలో కంచెను ఏర్పాటు చేశారు. అల్కపెరోసా గనిలో కార్యకలాపాలను కెనడాకు చెందిన లుండిన్ మైనింగ్ నిర్వహిస్తోంది. ఈ గొయ్యి ఏర్పడటం వల్ల తమకు ఎటువంటి నష్టం జరగలేదని ప్రకటించింది. అసలు ఇది ఏర్పడటానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు చిలీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ భారీ గొయ్యి శాంటియాగో నుంచి సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. ఈ గొయ్యి మరింత పెద్దదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఎలా ఏర్పడిందో తెలుసుకునేందుకు ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తోంది.

ఎందుకు ఇలా?

చిలీ (Chile) ప్రపంచంలోనే అతి పెద్ద రాగి ఉత్పత్తిదారు. ప్రపంచానికి అవసరమైన రాగిలో దాదాపు 25 శాతం వరకు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది.టియెరా అమరిల్లా నగర శివార్లలో అల్కపర్రోసా రాగి గనులు ఉన్నాయి. గత నెల 30వ తేదీన వాటి పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో, మట్టి రోడ్డు ఉన్న చోట.. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి పెద్ద శబ్దం చేస్తూ కూరుకు పోయింది. భూమి పొరల్లో అతి పెద్ద రాళ్లలో పగుళ్లు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో మట్టి కిందికి దిగుతుందని, దీనితో ఉపరితలంలో బిలాలు ఏర్పడే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.