Site icon HashtagU Telugu

Myanmar: మయన్మార్ లో వైమానిక దాడి.. 100 మంది పౌరులు మృతి

Myanmar

Resizeimagesize (1280 X 720) 11zon (1)

మయన్మార్ (Myanmar) సైన్యం మంగళవారం జరిపిన వైమానిక దాడిలో అనేక మంది చిన్నారులు సహా 100 మందికి పైగా మరణించారు. ANI ప్రకారం.. మరణించిన వారు సైనిక పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు. మంగళవారం ఉదయం మయన్మార్‌లో సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 100 మందికి పైగా మరణించారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. సైన్యం ప్రజలపై బాంబులు వేసి గాలిలోకి కాల్పులు జరిపిందని స్థానిక మీడియా పేర్కొంది.

స్థానిక మీడియా ప్రకారం.. సగయింగ్ ప్రాంతంలోని కాన్బాలు టౌన్‌షిప్‌లోని పజిగి గ్రామం వెలుపల తిరుగుబాటుదారులు నిర్వహించిన వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినప్పుడు సైన్యం దాడి చేసింది. ప్రతిపక్ష ఉద్యమ స్థానిక కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించాల్సి ఉంది. అప్పుడు సైన్యం ఫైటర్ జెట్‌లు గుంపుపై బాంబులు విసిరాయి. కొంత సమయం తరువాత హెలికాప్టర్లు గుంపుపైకి కాల్పులు జరిపాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం మృతుల సంఖ్య దాదాపు 50కి చేరుకుంది. అయితే స్వతంత్ర మీడియా ద్వారా వచ్చిన నివేదికల ప్రకారం ఈ సంఖ్య 100కి పైగానే ఉంది. ప్రభుత్వం ఇక్కడ జర్నలిస్టులపై నిషేధం విధించినందున మృతుల సంఖ్యను నిర్ధారించలేకపోతున్నారు.

Also Read: Vladimir Putin: మరింత క్షీణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం

సైనిక ప్రభుత్వ ప్రతినిధి మేజర్ జనరల్ జో మిన్ తున్ దాడిని అంగీకరించారు. తిరుగుబాటుదారులు హింసాత్మక ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తిరుగుబాటుదారులు తమకు మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని ప్రజలను బలవంతంగా ప్రేరేపించారని ఆయన ఆరోపించారు. బౌద్ధ సన్యాసులను, గురువులను చంపింది తిరుగుబాటుదారులేనని అన్నారు. ఇందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు.

అదే సమయంలో మయన్మార్‌లో ఘోరమైన వైమానిక దాడులను UN మానవ హక్కుల చీఫ్ ఖండించారు. పౌరులపై వైమానిక దాడులకు సంబంధించిన నివేదికలు చాలా కలవరపెడుతున్నాయని వోల్కర్ టర్క్ అన్నారు. బాంబులు పేల్చిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారని తెలిపారు. ఫిబ్రవరి 2021 నెలలో మయన్మార్ సైన్యం దేశంలో తిరుగుబాటు చేసింది. ఆ తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి మయన్మార్‌లో ఆర్మీ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో నిరసనకు వ్యతిరేకంగా సైన్యం ప్రజలపై చర్యలు తీసుకుంటోంది. మీడియా నివేదికల ప్రకారం.. గత రెండేళ్లలో మూడు వేల మందికి పైగా పౌరులు మరణించారు. మయన్మార్‌లోని పలు సంస్థలు ఈ ఘటనను ఖండించాయి.