Site icon HashtagU Telugu

Miss Universe 2022: మా నాన్న రూ.1400తో అమెరికాకు వచ్చారు.. సెకండ్ హ్యాండ్ దుస్తులతో అందాల పోటీలు గెల్చుకున్నా : మిస్ యూనివర్స్ బోనీ గాబ్రియెల్

Whatsapp Image 2023 01 15 At 22.06.21

Whatsapp Image 2023 01 15 At 22.06.21

Miss Universe 2022: 2022 సంవత్సరానికి “మిస్ యూనివర్స్” గా ఎంపికైన “మిస్ యూఎస్ఏ” ఆర్ బోనీ గాబ్రియెల్ (R’Bonney Gabriel) సక్సెస్ స్టోరీ చాలా గొప్పది. 28 ఏళ్ల  గాబ్రియెల్ ఫిలిపినో సంతతికి చెందిన మొదటి US పౌరురాలు.  గాబ్రియెల్ ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు. సామాన్య కుటుంబం నుంచి బోనీ మిస్ యూనివర్స్ సాధించే దాకా సాగించిన ప్రస్థానం
స్ఫూర్తిదాయకం.ఈ విజయం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో గాబ్రియెల్ తన తండ్రి రెమిజియో బొంజోన్ ‘ఆర్ బాన్’ గాబ్రియేల్ జీవన పోరాటం గురించి వివరించారు. ఆమె కథనం ప్రకారం.. “మా నాన్న 19 ఏళ్ల వయసులో స్టడీ స్కాలర్ షిప్ పై ఫిలిప్పీన్స్ నుంచి అమెరికాకి వచ్చి స్థిరపడ్డారు. అమెరికాకు చేరుకునే సరికి మా నాన్న జేబులో 20 డాలర్లు మాత్రమే ఉన్నాయి.  హ్యూస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన మనస్తత్వశాస్త్రంలో డాక్టరల్ డిగ్రీని పూర్తి చేశారు. తర్వాత సొంతంగా కార్ల రిపేర్ షాప్‌ను ప్రారంభించాడు.  అమెరికాలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన మా నాన్న.. టెక్సాస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆమే మా అమ్మ” అని
ఆర్ బోనీ గాబ్రియెల్ ఉద్వేగంతో వివరించారు. ” ఫిలిప్పైన్ మూలానికి చెందిన నేను మిస్ యూనివర్స్‌గా ఎంపిక కావడం అమెరికాలోని ఆసియా ప్రాంత ప్రవాస కుటుంబాల కలలకు రెక్కలు తొడుగుతుంది” అని బోనీ గాబ్రియెల్ కామెంట్ చేశారు.

ఆర్ బోనీ గాబ్రియెల్ కెరీర్ గ్రాఫ్..

గాబ్రియెల్ టీనేజ్‌లో డ్రెస్‌ డిజైన్‌లో ప్రతిభ కనిపించేది.15 ఏళ్ల వయసులో కుట్టుపని ప్రారంభించిన గాబ్రియెల్‌కు ఫ్యాబ్రిక్‌, టెక్స్‌టైల్‌తో వస్తువులను తయారు చేయడంపై ఆసక్తి పెరిగింది.  చిన్నవయసులోనే గాబ్రియేల్ ప్రతిభ బయట పడినప్పటికీ, గాబ్రియెల్‌ తప్పక చదువుకోవాలని ఆమె తండ్రి చెప్పారు. ఫ్యాషన్ రంగంపై తనకున్న అభిరుచిని గాబ్రియెల్ తన చదువులలోకి చేర్చుకుంది. ఫ్యాషన్ డిజైన్‌లో 2018లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచి డిగ్రీ చేసింది.   దీని తరువాత ఆమె న్యూయార్క్‌లో ఫ్యాషన్ డిజైనర్ నికోల్ మిల్లర్‌తో ఇంటర్న్‌షిప్ చేసింది. తనను తాను పర్యావరణ అనుకూల డిజైనర్‌గా అభివర్ణించుకునే గాబ్రియెల్‌కు దుస్తులను రీసైక్లింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆమె తరచుగా ఇలాంటి మెటీరియల్‌లను ఉపయోగించి తన సొంత దుస్తులను డిజైన్ చేస్తుంది. మిస్ టెక్సాస్ USA పోటీల కోసం గాబ్రియెల్ ధరించిన దుస్తులు సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయించే దుకాణంలో ఆమెకు లభించిన సెకండ్ హ్యాండ్ కోటు నుంచి తయారు చేసినవి కావడం గమనార్హం.