Site icon HashtagU Telugu

Muslim Hatred : పసివాడి ప్రాణం తీసిన ముస్లిం ద్వేషం

Muslim Hatred That Took The Life Of A Baby

Muslim Hatred That Took The Life Of A Baby

By: డా. ప్రసాదమూర్తి

Muslim Hatred : ప్రేమకు ఎల్లలు లేవు అంటారు గాని ద్వేషానికి ఎల్లలు లేవని ఇప్పుడు ప్రపంచమంతా నిరూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. యుద్ధం జరుగుతున్నది ఎక్కడో మధ్య ప్రాచ్యంలో. కొట్టుకుంటున్నది ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాలు. ఇజ్రాయిల్ చేస్తున్నది దురాక్రమణ, అణచివేత అని పాలిస్తీనా ప్రజలు వాదిస్తున్నారు. ఇజ్రాయిల్ సాగిస్తున్న ఆక్రమణ యుద్ధానికి ప్రతిఘటనగానే తాము యుద్ధంలో దిగామని పాలస్తీనాలో గాజా ప్రాంతాన్ని పాలిస్తున్న హమాస్ మిలిటెంట్ దళాలు చెబుతున్నాయి. దశాబ్దాల అణిచివేత, ఆక్రమణ పాలస్తీనా వాసుల్ని ఉగ్రవాదులుగా మార్చి వేస్తోందని ఆదేశాల వాస్తవ చరిత్రను పరిశీలించిన వారు చెబుతున్నారు.

కారణాలు ఏమైనప్పటికీ, చరిత్ర చెబుతున్న సత్యం ఏదైనప్పటికీ ఇజ్రాయిల్ పాలిస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం ఆ రెండు దేశాలకే పరిమితం కావడం లేదు. ప్రపంచమంతా ఇప్పుడు అటో ఇటో కొమ్ముకాసే పరిస్థితి వస్తోంది. దీనికి తోడు రెండు జాతుల మధ్య ప్రపంచ ప్రజలు, మతాలు కూడా చీలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటూ ఒక వర్గాన్ని మరొక వర్గం శత్రువుగా భావించే స్థితికి ఈ తాజా యుద్ధం ప్రపంచాన్ని నెడుతోంది. దీనికి అమెరికాలో ఒక పసిప్రాణాన్ని బలిగొన్న ముస్లిం ద్వేషం (Muslim Hatred) వార్త సంచలన ఉదాహరణగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

అమెరికాలో ఒక పెద్ద మనిషి ఆరు సంవత్సరాల ముస్లిం బాలుణ్ణి చంపేశాడు. ఆ కుర్రవాడి తల్లిని ప్రాణాంతకంగా గాయపరిచాడు. దీనికి కారణం ఇటీవల పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధమేనని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొన్న వార్త ద్వారా తెలుస్తోంది. జోసెఫ్ జుబా అనే 71 సంవత్సరాల ఒక అమెరికన్ ఇంటి యజమాని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతని చేతిలో బలైన పసివాడు, గాయాలపాలై మృత్యువుతో పోరాడుతున్న 32 సంవత్సరాల అతని తల్లి, ఇద్దరూ అమెరికన్ పాలసీనియన్లు. అమెరికాలోని చికాగో నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణ ఘటన సంభవించింది. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి కేవలం ముస్లిం ద్వేషం (Muslim Hatred)తోనే ఇలా చేశాడని, దీనికి నేపథ్యం ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధమేనన్న వార్త వెలుగు చూసిన వెంటనే, ప్రపంచవ్యాప్తంగా దీని మీద తీవ్రమైన ప్రతిస్పందన వ్యక్తం కావడం మొదలైంది.

ఇజ్రాయిల్ అంటే యూదులు, పాలిస్తీనా అరబ్బులు అని తెలుసు. కానీ ఎక్కడో జరుగుతున్న యుద్ధం, మరెక్కడో ముస్లిం మతస్తులకు వ్యతిరేకంగా ఇంత దారుణమైన ద్వేషాన్ని రగిలిస్తుందని ఊహించడానికి కూడా కష్టంగానే ఉంది. కానీ జరిగింది కటిక వాస్తవం. అమెరికాలో ఈ వార్త వెలుగు చూసిన వెంటనే అటు అమెరికా పోలీసులు, ఇతర పశ్చిమ దేశాల పోలీసులు, తమ దేశాల్లో ఇస్లాం వ్యతిరేక విద్వేష దాడులు జరగకుండా అరికట్టడానికి కట్టుదిట్టమైన అప్రమత్త చర్యలు తీసుకున్నారు. హై అలెర్ట్ ప్రకటించారు.

Also Read:  Balakrishna Counter to Kodali Nani : నువ్వేం పీక్కొని గెడ్డం పెట్టుకుంటావ్.. కొడాలి నానికి బాలయ్య కౌంటర్

ఈ ఘటన పట్ల చికాగోలోని అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్, అలాగే ముస్లిం సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ జరిగిన ఘటనను అత్యంత దారుణమైన పీడకలగా పేర్కొన్నాయి. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ వార్త విని తాను ఎంతో చలించిపోయానని ఆయన అన్నారు. ఇలాంటి ఇస్లామోఫోబియాను అమెరికన్లు అంతా కలిసికట్టుగా తిప్పి కొట్టాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటువంటి విద్వేష ఘటనల పట్ల తాము మౌనం వహించమని, అమెరికాలో ద్వేషానికి స్థానం లేదని ఆయన అన్నారు. బాధితుల కుటుంబానికి, పాలస్తీనియన్, అరబ్, ముస్లిం అమెరికన్ సముదాయాలకు కూడా ఆయన తన సానుభూతిని తెలియజేశారు.

ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల్లో జరుగుతున్న మారణకాండలో రోజూ వందలాదిమంది హతులవుతున్నారు. లక్షలాదిమంది నిర్వాసితులవుతున్నారు. వేలాదిమంది క్షతగాత్రులవుతున్నారు. ప్రపంచం విని, చూసి తట్టుకోలేని దారుణం అక్కడ జరుగుతోంది. దీనికి తోడు ఇలాంటి ద్వేషం ప్రపంచమంతా పెచ్చరిల్లితే ఇక మానవత్వం అనేదానికి అర్థం ఏముంది? ప్రపంచంలో ఎక్కడైనా రెండు దేశాల మధ్య, రెండు మతాల మధ్య, రెండు జాతుల మధ్య ఘర్షణ జరిగితే అదంతా వాటికే పరిమితం కావాలి. కానీ ఆ ప్రభావం మరోచోట ద్వేష రూపంలో వెల్లడి కాకూడదు. అమెరికాలో బలైన ఆరు సంవత్సరాల పసివాడి మరణ వార్త ప్రపంచంలోని ప్రజలందరికీ ఇదే హెచ్చరిస్తోంది.

అల్లకల్లోల సమయాల్లో మనుషుల మధ్య ప్రేమ పుట్టాలి గాని ద్వేషం రగలకూడదు. మనదేశంలో కూడా ఇజ్రాయిల్ అణచివేతను సమర్థిస్తూ, పాలస్తీనా ప్రజల కన్నీటి కష్టాలకు ఆనందపడే వికృత మనస్తత్వాలను చూస్తున్నాం. దేశం ఏదైనా మతం ఏదైనా ప్రాంతం ఏదైనా యుద్ధంలో బలైపోయేది అమాయక ప్రజలే. ఆ ప్రజల పట్ల మన సానుభూతి ఉండాలే గానీ ద్వేషం కూడదు.

Also Read:  TCongress: అధికారమే లక్ష్యంగా రాహుల్, ప్రియాంక ప్రచార పర్వం, విజయ భేరి పాదయాత్రతో శ్రీకారం!