ఇరాన్(Iran )పై ఇజ్రాయెల్ (Israel ) జరిపిన సైనిక దాడులను ప్రపంచంలోని 21 ముస్లిం దేశాలు ఖండించాయి. ఈజిప్ట్, అల్జీరియా, బహ్రెయిన్, బ్రూనై, చాడ్, ఇరాక్, జోర్డాన్, కువైట్, లిబియా, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, సుడాన్, సోమాలియా, మరిటానియా, గాంబియా, తుర్కియే, యూఏఈ, కొమొరోస్, జిబూటిలు కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ దాడులు అంతర్జాతీయ న్యాయాన్ని ఉల్లంఘించడమే కాకుండా మానవ హక్కులకూ విరుద్ధమని పేర్కొన్నాయి.
ఈ దేశాలు ఇజ్రాయెల్‌ను తక్షణమే కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) అమలు చేయాలని డిమాండ్ చేశాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ నాయకులను కోరాయి. నిరాయుధీకరణ, మానవత్వం పరిరక్షణే ఇప్పటి అత్యవసర అవసరమని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో ముస్లిం దేశాలు మిడిల్ ఈస్ట్‌ను అణ్వాయుధ రహిత ప్రాంతంగా మార్చాలని పిలుపునిచ్చాయి. అంతేకాదు ఇజ్రాయెల్‌ను కూడా అణ్వాయుధ వ్యాప్తిని నిరోధించే ఒప్పందం అయిన ఎన్పీటీ (NPT)లో చేరాలని కోరాయి. అణ్వాయుధాల నిర్మూలనతో మాత్రమే శాశ్వత శాంతికి దారితీస్తుందని ఈ దేశాల అభిప్రాయం. ఈ పిలుపుతో మిడిల్ ఈస్ట్ రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.