Site icon HashtagU Telugu

Mount Semeru: బద్ధలైన ‘మౌంట్‌ సెమేరు’. హెచ్చరికలు జారీ.

Mount Semeru Indonesia

Mpunt Semeru

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో మరో ప్రకృతి విపత్తు సంభవించింది. స్థానికంగా ఉండే, దేశంలోనే అతి ఎత్తయిన అగ్నిపర్వతం ‘మౌంట్‌ సెమేరు’ ఆదివారం తెల్లవారుజామున విస్ఫోటం చెందింది. ఇటీవల భారీ భూకంపంతో అతలాకుతలమైన ఇండోనేసియా (Indonesia)లోని జావా ద్వీపంలో మరో ప్రకృతి విపత్తు సంభవించింది. స్థానికంగా ఉండే, దేశంలోనే అతి ఎత్తయిన అగ్నిపర్వతం ‘మౌంట్‌ సెమేరు (Mount Semeru)’ ఆదివారం తెల్లవారుజామున విస్ఫోటనం చెందింది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున లావా వెలువడటంతోపాటు దాదాపు ఒకటిన్నర కి.మీల ఎత్తువరకు దట్టమైన పొగ కమ్ముకుంది. దాదాపు 19 కిలోమీటర్ల పరిధిలో బూడిద వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు గరిష్ఠ స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటివరకు రెండు వేలకుపైగా స్థానికులను తాత్కాలిక ఆశ్రయాలు, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు దేశ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ(BNPB) తెలిపింది.

స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 2:46 గంటలకు మౌంట్ సెమేరు (Mount Semeru) విస్ఫోట ప్రక్రియ ప్రారంభమైందని బీఎన్‌పీబీ వెల్లడించింది. క్రమంగా పరిస్థితులు తీవ్రంగా మారుతుండటంతో.. మధ్యాహ్నానికి అధికారులు అగ్నిపర్వతం చుట్టూ 5 కి.మీలనుంచి 8 కి.మీల పరిధిని డేంజర్ జోన్‌గా ప్రకటించారు. లావా ప్రవాహం తాకే అవకాశం ఉన్న బెసుక్ కొబోకాన్ నది ఆగ్నేయ ప్రాంతంనుంచి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇండోనేషియా అగ్నిపర్వతాల, భూసంబంధిత ప్రమాదాల నివారణ కేంద్రం హెడ్‌ హెండ్రా గుణవాన్ సూచించారు. ఇదిలా ఉండగా.. ఈ అగ్నిపర్వతం బద్ధలు కావడం ఇది వరుసగా మూడో ఏడాది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన పేలుడు ఘటనలో 50 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.