Hajj Pilgrims : 550 మందికిపైగా హజ్ యాత్రికులు మృతి

సౌదీ అరేబియాలో హజ్ యాత్ర విషాదాన్ని మిగిల్చింది.

  • Written By:
  • Updated On - June 19, 2024 / 07:55 AM IST

Hajj Pilgrims : సౌదీ అరేబియాలో హజ్ యాత్ర విషాదాన్ని మిగిల్చింది. ఈసారి దాదాపు 18 లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లగా.. వివిధ దేశాలకు చెందిన దాదాపు 550 మంది యాత్రికులు చనిపోయారు. వీరిలో అత్యధికంగా 323 మంది ఈజిప్టు దేశస్తులే కావడం గమనార్హం. హజ్ యాత్రకు కేంద్రమైన మక్కా నగరంలో టెంపరేచర్స్ ఈసారి 51 డిగ్రీలు దాటాయి. దీంతో వడదెబ్బకు గురై వీరిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వయసు పైబడినవారు, తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వారు ఈ మండే ఎండలతో ప్రభావితులై చనిపోయారు. చనిపోయిన వారిలో దాదాపు 60 మంది జోర్డాన్ దేశస్తులు కూడా ఉన్నారు. భారత్ నుంచి వెళ్లిన పలువురు హజ్ యాత్రికులు కూడా మరణించారు.

We’re now on WhatsApp. Click to Join

ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్ దేశాల హజ్ యాత్రికులు(Hajj Pilgrims) కూడా కొందరు చనిపోయారు. సౌదీ అరేబియాలోని ఆయా దేశాల రాయబార కార్యాలయాలు దీనికి సంబంధించిన వివరాలను తాజాగా విడుదల చేశాయి. పలు దేశాలకు చెందిన హజ్ యాత్రికులు తప్పిపోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా, భారీ ఎండల కారణంగా గత ఏడాది కూడా 240 మంది హజ్ యాత్రికులు చనిపోయారు.

Also Read : Earthquake: ఇరాన్‌లో భారీ భూకంపం.. నలుగురు మృతి, 120 మందికి గాయాలు

  • హజ్‌ యాత్రలో భాగంగా జూన్ 17న (సోమవారం) మీనాలో సైతానును రాళ్లతో కొట్టే కార్యక్రమం జరిగింది. ఆ రోజు తెల్లవారుజామునే జమారత్‌ వంతెన దగ్గరకు లక్షల సంఖ్యలో హజ్ యాత్రికులు చేరుకున్నారు. గులకరాళ్లతో మూడు రాతి స్తంభాలను కొట్టారు. ఈ స్తంభాలనే సైతానుగా భావిస్తారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని ఐదు గంటలసేపు (ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో) సౌదీ అధికారులు నిలిపివేశారు.
  • మంగళవారం కూడా రాళ్లతో సైతానును కొట్టే కార్యక్రమం జరిగింది.
  • అనంతరం హజ్ యాత్రికులు మక్కాకు చేరుకున్నారు. కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేశారు. దీంతో ఈసారి హజ్ యాత్ర ముగిసింది.

Also Read : PM Modi: వారణాసిలోని క్రికెట్ స్టేడియంలో ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ