Republic Day 2024: గణతంత్ర వేడుకలకు జో బిడెన్‌ను ఆహ్వానించిన మోదీ

జీ20 సదస్సులో ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు.

Republic Day 2024: జీ20 సదస్సులో ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ తెలిపారు.

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం భారతదేశం గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని ప్రపంచ నాయకులను ఆహ్వానిస్తుంది. COVID-19 మహమ్మారి దృష్ట్యా 2021 మరియు 2022లో రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించలేదు. ఇందులో దేశంలోనూ వేడుకలు జరగలేదు. 2020లో అప్పటి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2019లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరు కాగా 2018లో మొత్తం 10 ఆసియాన్ దేశాల నాయకులు వేడుకలకు హాజరయ్యారు. 2017లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కాగా 2016లో అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే వచ్చారు.

2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పరేడ్‌ను వీక్షించారు. 2014లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కాగా 2013లో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ హాజరయ్యారు. అదేవిధంగా నికోలస్ సర్కోజీ, వ్లాదిమిర్ పుతిన్, నెల్సన్ మండేలా, జాన్ మేజర్, మహ్మద్ ఖతామీ మరియు జాక్వెస్ చిరాక్ వంటి ఇతర దేశాధినేతలు భారతదేశంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. 1993లో జరిగిన వేడుకలకు అప్పటి బ్రిటిష్ ప్రధాని జాన్ మేజర్ హాజరు కాగా 1995లో అప్పటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా, 2010లో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్ బాక్ పాల్గొన్నారు.

Also Read: Gooseberry : ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఉసిరికాయను తినవద్దు..