సోవియట్ యూనియన్ చివరి నేత మిఖాయిల్ గోర్బచేవ్(91) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు రష్యా వార్తా సంస్థలు ప్రకటించాయి. 1985 నుంచి 1991 వరకు ఆయన సోవియట్ యూనియన్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలకు, సోవియట్ యూనియన్ నేతృత్వంలోని తూర్పు దేశాలకు మధ్య ఏళ్ల తరబడి జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం ముగింపులో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించినందుకు ఆయనకు 1990లో నోబెల్ బహుమతి లభించింది. అయితే, రష్యాలో ఎక్కువ మంది ఆయనను సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి కారకుడిగా భావిస్తారు. గోర్బచేవ్ అంత్యక్రియలు నొవోడెవిచి శ్మశానవాటికలో జరగనున్నాయి.
ఆ నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ తో కలిసి అణ్వాయుధాల సంఖ్యను తగ్గించడానికి గోర్బచేవ్ తీవ్రంగా కృషి చేసి విజయం సాధించారు. గోర్బచేవ్ మృతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గోర్బచేవ్ ఓ అద్భుతమైన నేతగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కొనియాడారు. సోవియట్ ప్రజలు ముందడుగు వేయడానికి కృషిచేశారన్నారు.