Venezuela: వెనిజులా రాజధాని కారకాస్ సహా మిరాండా, అర్గువా, లా గుయిరా వంటి పలు కీలక సైనిక స్థావరాలపై అమెరికా అర్ధరాత్రి వైమానిక దాడులు జరిపింది. అనంతరం అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్యతో సహా యూఎస్ ఆర్మీ అరెస్టు చేసిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అసలు ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మదురోపై ఎందుకు అంత పగ పెంచుకున్నారు? దీనికి గల ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నాయి.
మదురోపై ట్రంప్ ఆగ్రహానికి కారణాలు
అక్రమ వలసలు
వెనిజులా నుండి అమెరికాకు చేరుకుంటున్న వేలాది మంది అక్రమ వలసదారులకు మదురోనే బాధ్యుడని ట్రంప్ భావిస్తున్నారు. 2013 తర్వాత వెనిజులాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు అమెరికాకు తరలివచ్చారు.
డ్రగ్ ట్రాఫికింగ్
మదురోను ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ స్మగ్లర్‌గా ట్రంప్ అభివర్ణించారు. అమెరికాలోకి కొకైన్, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ సరఫరా వెనుక మదురో హస్తం ఉందని ఆరోపిస్తూ ఆయనను పట్టిస్తే 5 కోట్ల డాలర్ల (సుమారు రూ. 400 కోట్లు) బహుమతిని కూడా ప్రకటించారు.
Also Read: హోం లోన్‌కు అప్లై చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి!
చమురు నిల్వలపై కన్ను
ఈ డ్రగ్స్ ఆరోపణలు కేవలం ఒక సాకు మాత్రమేనని మదురో వాదిస్తున్నారు. వెనిజులాలోని అపారమైన చమురు నిల్వలను దక్కించుకోవడానికే ట్రంప్ తనను అధికారంలో నుంచి తొలగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
మదురో తర్వాత అధికారం ఎవరికి?
ఒకవేళ ట్రంప్ చేసిన అరెస్ట్ ప్రకటన నిజమైతే వెనిజులా రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలికంగా అధికారాన్ని చేపట్టాల్సి ఉంటుంది. అయితే అమెరికా మదురో ప్రభుత్వాన్ని గుర్తించడం లేదు. దేశం విడిచి వెళ్ళిన విపక్ష నేత ఎడ్మండో గొంజాలెజ్ మాత్రమే అసలైన అధ్యక్షుడని అమెరికా, అక్కడి విపక్షాలు వాదిస్తున్నాయి.
13 ఏళ్ల నిరంకుశ పాలన
నికోలస్ మదురో 2013 నుంచి వెనిజులా అధ్యక్షుడిగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, గొంజాలెజ్ గెలిచినప్పటికీ మదురో తనను తాను విజేతగా ప్రకటించుకున్నారని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
విపక్ష నేత మరియా కొరినా మచాడో
వెనిజులా ప్రధాన విపక్ష నేత మరియా కొరినా మచాడో ఎన్నికల్లో పోటీ చేయకుండా మదురో నిషేధం విధించారు. ప్రాణ భయం ఉన్నప్పటికీ ఆమె రహస్యంగా సముద్ర మార్గం గుండా ఓస్లో చేరుకుని, అక్టోబర్ 2025లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. మదురో ప్రభుత్వంపై పోరాటంలో ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
