విశాఖ వాతావరణ కేంద్రం మాజీ డ్యూటీ ఆఫీసర్ కృష్ణ భగవాన్ (Krishna Bhagavan ) భూకంపాలకు గల కారణాలను విశ్లేషించారు. ఆయన ప్రకారం.. భూమి క్రస్ట్, మాంటిల్, కోర్ అనే మూడు ప్రధాన పొరలతో నిర్మితమై ఉంటుంది. భూమి క్రస్ట్ అనేక టెక్టానిక్ ప్లేట్‌లగా విభజించబడి నిరంతరం కదులుతూ ఉంటుంది. ఈ ప్లేట్‌లు ఒకదానికొకటి తాకినప్పుడు లేదా విరిగినప్పుడు భూమి లోపల భారీ శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి ప్రకంపనల రూపంలో భూమి ఉపరితలంపై వ్యాపిస్తుంది, దీనినే మనం భూకంపం (Earthquake) అని పిలుస్తాము. భూ పలకల కదలికలు, భూగర్భ ప్రేరణలు కూడా భూకంపాలకు కారణమవుతాయని ఆయన తెలిపారు.
మానవ కార్యకలాపాలు కూడా భూకంపాలకు ఒక ప్రధాన కారణమని కృష్ణ భగవాన్ నొక్కి చెప్పారు. అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడం, కొండలను తవ్వడం వంటివి భూమి వేడెక్కడానికి దారితీసి భూకంపాలకు కారణమవుతున్నాయని ఆయన అన్నారు. పూర్వం పచ్చని కొండలు ఉండేవని, ఇప్పుడు అవి అంతరించిపోతున్నాయని తెలిపారు. పచ్చని వాతావరణం ఉంటే మంచి వర్షాలు పడతాయని, భూమి చల్లగా ఉంటుందని చెప్పారు. అడవులను తొలగించడం, సాంకేతికత పేరుతో మనం చేసే తప్పులే భూమి వేడెక్కడానికి, తద్వారా భూకంపాలు రావడానికి కారణమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కువ చెట్లు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుంటే మంచి వర్షాలు పడి, చల్లని వాతావరణం ఏర్పడి భూకంపాలు తగ్గుతాయని ఆయన సూచించారు.
Shocking : మూఢనమ్మకాలకు బలైన గృహిణి.. “దేవుడి దగ్గరికి వెళ్తున్నా” అంటూ
దురదృష్టవశాత్తు, భూకంపాలు ఎప్పుడు వస్తాయో కచ్చితంగా అంచనా వేయగల సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదని కృష్ణ భగవాన్ పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పగలరు తప్ప, ఒక నిర్దిష్ట ప్రదేశంలో కచ్చితంగా ఎప్పుడు వస్తుందో చెప్పడానికి ప్రస్తుతానికి ఎటువంటి సాంకేతికత అందుబాటులో లేదన్నారు. వాతావరణ అంచనాల మాదిరిగానే, రెండు మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడం తప్ప, భూకంపాలను కచ్చితంగా అంచనా వేయలేమని ఆయన ఉదాహరించారు.
చివరగా, పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మానవులపైనే ఉందని కృష్ణ భగవాన్ స్పష్టం చేశారు. ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, భూకంపం వచ్చిన తర్వాతే దాని గురించి తెలుసుకోగలం తప్ప, అది రాకముందే అంచనా వేయగల అధునాతన సాంకేతికత ఇంకా లేదన్నారు. కాబట్టి, ప్రజలందరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, అది భూకంపాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన పిలుపునిచ్చారు.