. భారత్ నుంచి రష్యాకు పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు
. కార్మికుల రక్షణకు భారత్–రష్యా ఒప్పందాలు
. లక్షల సంఖ్యలో నిపుణుల అవసరం
Russia: తీవ్రమైన కార్మికుల కొరతతో ఇబ్బందులు పడుతున్న రష్యా ఇప్పుడు భారత్‌ను కీలక భాగస్వామిగా చూస్తోంది. వివిధ రంగాల్లో ఖాళీలను భర్తీ చేయాలనే లక్ష్యంతో ఈ ఏడాది సుమారు 40 వేల మంది భారతీయ కార్మికులను నియమించుకోవడానికి రష్యా సిద్ధమవుతోంది. ఇప్పటికే గత ఏడాది చివరి నాటికి 70 వేల నుంచి 80 వేల మంది భారతీయులు రష్యాలో పనిచేస్తున్నారని అంచనాలు ఉన్నాయి. పరిశ్రమలు, సేవా రంగాలు, మున్సిపల్ విభాగాలు వంటి అనేక రంగాల్లో ఉద్యోగుల అవసరం పెరగడంతో భారత్ నుంచి వచ్చే నైపుణ్యం గల యువతపై రష్యా ఆశలు పెట్టుకుంది.
భారత్ నుంచి నైపుణ్యం కలిగిన మరియు పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికులను రష్యాకు పంపే ప్రక్రియను సులభతరం చేయడానికి ఇరు దేశాలు గత డిసెంబర్‌లో రెండు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యం కార్మికుల నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించడం అలాగే గతంలో ఎదురైన మోసాలు అక్రమ నియామకాల వంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడడం. కార్మికులకు సరైన వేతనం, భద్రత, ఉద్యోగ హక్కులు లభించేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. దీని వల్ల భారతీయ కార్మికుల్లో విశ్వాసం పెరిగే అవకాశం ఉండగా రష్యాకు అవసరమైన మానవ వనరులు కూడా సక్రమంగా అందుబాటులోకి రానున్నాయి.
dw.com కథనం ప్రకారం రష్యాలో దాదాపు ఐదు లక్షల మంది పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికులకు తక్షణ అవసరం ఉంది. అంతేకాకుండా మొత్తం మీద 30 లక్షల మంది నిపుణుల కొరతను ఆ దేశం ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల వ్యాఖ్యానించారు. భారత్‌లో ఉన్న యువత శక్తివంతమైన నైపుణ్య శ్రామిక వర్గం ఈ లోటును భర్తీ చేయగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వీధులు శుభ్రం చేసే పనిలో ఒక భారతీయ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌తో సహా 17 మంది భారతీయులు పనిచేస్తున్నారని రష్యన్ మీడియా సంస్థ ‘ఫొంటాంకా’ వెల్లడించడం గమనార్హం. ఇది రష్యాలో ఉద్యోగాల స్వరూపం ఎలా మారుతోందో సూచిస్తోంది. మున్సిపల్ సేవలు, మౌలిక వసతులు, ఇతర సేవా రంగాల్లో కార్మికుల కొరత పెరగడంతో రష్యా భారత్ వంటి మిత్రదేశాల నుంచి నియామకాలు చేపట్టేందుకు మరింత ఆసక్తి చూపుతోంది. భారత్‌కు ఇది విదేశీ ఉపాధి అవకాశాలను విస్తరించే మంచి అవకాశం కాగా, రష్యాకు మాత్రం ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు అవసరమైన మానవ వనరుల సమస్యకు పరిష్కార మార్గంగా మారుతోంది.
