Heavy Rains : చైనా రాజధాని బీజింగ్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వరదలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, బీజింగ్‌లో జరిగిన వరదల కారణంగా ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దాదాపు 80 వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. బీజింగ్‌లోని మియున్ జిల్లా వరదల ప్రభావంతో బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఇక్కడ ఒక్క మియున్‌లోనే 28 మంది మరణించగా, యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతి పెరిగిన కొద్ది కొండచరియలు విరిగిపడి ప్రావిన్స్‌లో నలుగురు మరణించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొంతమంది అదృశ్యమయ్యారు. వారికోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని బీజింగ్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.
ఇప్పటివరకు దాదాపు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వీరిలో 17 వేలకు పైగా మియున్ జిల్లాకు చెందినవారు. లువాన్‌పింగ్ కౌంటీకి చెందిన పలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షపు నీరు ఆప్రాంతాలను ముంచివేయడంతో కొంతమంది ప్రజలు అక్కడే చిక్కుకుపోయారు. వారికి సహాయాన్ని అందించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నదుల్లో వరదనీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో దిగువన ఉన్న గ్రామాల్లో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత తొందరగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్నిచోట్ల వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో వంతెనలు, రహదారులు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రహదారులపై అడ్డంకులు ఏర్పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలిన ఘటనలతో పలు ప్రాంతాలు చీకటిలో మునిగిపోయాయి. ప్రావిన్స్‌లోని లువాన్‌పింగ్ కౌంటీ సరిహద్దుల్లో పలు కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
ఈ విపత్తుపై స్పందించిన చైనా ప్రధాని లీ క్వియాంగ్ భారీ వర్షాలు, వరదలు దేశానికి తీవ్ర నష్టం కలిగించాయని పేర్కొన్నారు. ప్రాణ నష్టం మాత్రమే కాదు, ఆస్తి నష్టాలు కూడా భారీ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయని, అవసరమైన అన్ని నిబంధనలతో సహాయక బృందాలు రంగంలో ఉన్నాయని ఆయన తెలిపారు. అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేసి, అక్కడకు తరలించిన ప్రజలకు తిండి, నీరు, ప్రాథమిక వైద్యం వంటి అవసరాలను అందిస్తున్నారు. విద్యుత్, రవాణా వంటి విభాగాల పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వరదల ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తతే మేలు అనే సందేశాన్ని స్థానిక అధికారులు ప్రజలకు నిస్తూ ఉంటున్నారు. అధికార యంత్రాంగం స్పందన వేగంగా ఉండటం ఊరట కలిగిస్తోంది గానీ, మరిన్ని ప్రాణనష్టం జరగకూడదనే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Read Also: Nimisha Priya : యెమెన్‌లో నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు.. భారత ప్రభుత్వ కృషికి ఫలితం