Site icon HashtagU Telugu

Blast – Pak EC : పాక్‌ ఈసీ కార్యాలయంలో బాంబు పేలుడు.. అసలేం జరుగుతోంది ?

Pak Soldiers

Pak Soldiers

Blast – Pak EC : పాకిస్తాన్‌లో బాంబు పేలుళ్లు ఆగడం లేదు. చివరకు ఆ దేశానికి చెందిన ఎన్నికల సంఘం కార్యాలయాల్లోనూ బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. దీన్ని బట్టి ఆ దేశం నిఘా వ్యవస్థలు, భద్రతా వ్యవస్థలు ఎలా విఫలమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి కరాచీలోని పాకిస్తాన్ ఎన్నికల సంఘం కార్యాలయంలో బాంబు పేలుళ్లు సంభవించాయి.  ఈ ఆఫీసు గోడ వద్ద ఒక షాపింగ్ బ్యాగ్‌లో పేలుడు పదార్థాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఉంచినట్టు దర్యాప్తులో వెల్లడైంది. పేలుడు తీవ్రతను అంచనా వేయడానికి బాంబు స్వ్కాడ్‌ను ఘటనా స్థలానికి పంపించారు. షాపింగ్ బ్యాగులో  దాదాపు 400 గ్రాముల మందుగుండుతో కూడిన బాంబును పెట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. పేలుడు జరిగిన ప్రదేశంలో టైమ్ డివైజ్, 12 వోల్ట్ బ్యాటరీ కూడా దొరికాయని తెలిసింది. ఇక ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సీనియర్ పోలీస్ అధికారి సాజిద్ సదోజాయ్ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

పాక్ ఎన్నికల సంఘం స్పందన ఇదీ.. 

ఈ ఇష్యూపై పాక్ ఎన్నికల సంఘం(Blast – Pak EC) స్పందిస్తూ.. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. తమకు భద్రతా పరమైన సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. పాకిస్తాన్‌లో ఈ నెల 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.పాక్‌ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుంటారు. 266 మందిని నేరుగా ఎన్నుకుంటారు. 70 సీట్లను మహిళలు, మతపరమైన మైనారిటీలకు; ఆరింటిని గిరిజన ప్రాంతాల వారికి రిజర్వు చేశారు. ఈ స్థానాలను పార్టీలకు గెలుచుకున్న స్థానాలను బట్టి నైష్పత్తిక ప్రాతిపదికన కేటాయిస్తారు.

Also Read : Group 1 Notification : గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్.. 660 పోస్టుల భర్తీ ?

ఈసారి నవాజ్‌ షరీఫే ప్రధాని ?

పాక్‌ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు 74 ఏళ్ల నవాజ్‌ సొంతం. భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే నేతగానూ ఆయనకు పేరుంది. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడని కూడా చెబుతారు. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌) సారథిగా మూడోసారి ప్రధానిగా ఉండగా 2017లో పనామా పేపర్స్, లండన్‌ అపార్ట్‌మెంట్స్‌ వంటి నానారకాల కేసుల్లో ఇరుక్కున్నారు. పదవి పోగొట్టుకుని జైలుపాలై ప్రాణ భయంతో లండన్‌ పారిపోయారు. అనంతరం పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్‌కూ నాలుగేళ్లలోపే అదే గతి పట్టింది. 2022లో నవాజ్‌ సోదరుడు షహబాజ్‌ షరీఫ్‌ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవడంతో నవాజ్‌కు మంచి రోజులు తిరిగొచ్చాయి. గత అక్టోబర్లో ఆయన తిరిగొచ్చి పీఎంఎల్‌ (ఎన్‌) పగ్గాలు చేపట్టడం, సైన్యంతో పాటు న్యాయ వ్యవస్థ దన్నూ తోడై ఆయనపై అవినీతి కేసులు, శిక్షలూ ఒక్కొక్కటిగా రద్దవడం చకచకా జరిగిపోయాయి. అడ్డంకులన్నీ తొలిగి ఎన్నికల బరిలో నిలిచిన నవాజ్‌ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమేనంటున్నారు.

Exit mobile version