Masked Burglars : మాస్కులు ధరించిన దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన భవనంలోనే చోరీకి పాల్పడ్డారు. ఓ ట్రక్కును, మరో బైక్‌ను ఎత్తుకుపోయారు. ఈ ఘటన ఆదివారం రాత్రి బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ పరిధిలో ఉన్న విండ్సర్ క్యాజిల్‌లో(Masked Burglars) చోటుచేసుకుంది. ఇద్దరు ముసుగు దొంగలు ఈ కోటకు ఉండే ఆరు అడుగుల ఎత్తైన ఫెన్సింగ్‌ను దూకి లోపలికి చొరబడ్డారు. అనంతరం అక్కడున్న ట్రక్కు, బైక్‌లను దర్జాగా తీసుకెళ్లారు. అయినా భద్రతా సిబ్బంది ఈ దొంగలను గుర్తించలేకపోయారు. ఈ చోరీ జరిగిన విండ్సర్ క్యాజిల్‌కు సమీపంలోనే ఉన్న అడిలైడ్ కాటేజ్ అని పిలిచే మరో నివాసంలో ప్రిన్స్ విలియం, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్, వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విండ్సర్ క్యాజిల్ నుంచి కేవలం 5 నిమిషాల కాలినడక దూరంలో అడిలైడ్ కాటేజ్ ఉంది.
Also Read :Super Biker : సూపర్ బైకర్ నవీన్.. కృత్రిమ కాలితో ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతానికి
ప్రిన్స్ విలియం దంపతులు అంతకుముందు విండ్సర్ కోటలోనే ఉండేవారు. అయితే క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల కార్యక్రమాల కోసం 2022 సంవత్సరంలో విండ్సర్ కోటను వాడుకున్నారు. అప్పటి నుంచి ప్రిన్స్ విలియం కుటుంబం ఈ కోటకు సమీపంలోని అడిలైడ్ కాటేజీలో నివసిస్తోంది. ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు సేద తీరేందుకు అప్పుడప్పుడు విండ్సర్ కోటకు వస్తుంటారు. ఈ చోరీ జరిగిన టైంలో వారు ఈ కోటలో లేరు. నిత్యం భారీ భద్రత ఉండే ఈ బ్రిటన్ రాచరిక కోటలో దొంగలు పడటం అనేది యావత్ బ్రిటన్‌లో కలకలం రేపుతోంది. భద్రతా సిబ్బంది వైఫల్యం వల్లే ఇలా జరిగిందనే వాదన వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. ఈ చోరీ అక్టోబరు 13న రాత్రి 11.45 గంటలకు జరిగింది. దీనిపై అత్యంత ఆలస్యంగా.. నెల రోజుల తర్వాత బ్రిటన్ పోలీసులు ఇప్పుడు అధికారిక ప్రకటన విడుదల చేశారు.