. ఇది సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణించిన రష్యా, ఇరాన్, క్యూబా
. వెంటనే ఐరాస భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్
. వెనెజులా ప్రజలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన రష్యా
Venezuela : శనివారం వెనెజులాపై అమెరికా భారీ స్థాయిలో సైనిక దాడికి పాల్పడిందన్న వార్తలు అంతర్జాతీయ వేదికపై కలకలం రేపాయి. ఈ ఆపరేషన్‌లో వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకుని దేశం వెలుపలికి తరలించినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెంటనే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా చేపట్టిన చర్యలు వెనెజులా రాజకీయ స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడి లక్ష్యం ఏమిటి? దాని వెనుక ఉన్న ఉద్దేశాలు ఏంటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి.
అమెరికా సైనిక చర్యను రష్యా తీవ్రంగా ఖండించింది. వెనెజులా సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఇది బహిరంగంగా ఉల్లంఘించడమేనని రష్యా విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. “ఇలాంటి దాడులకు చెప్పే కారణాలు నిలకడలేనివి. కేవలం సైద్ధాంతిక శత్రుత్వమే ఈ చర్యకు కారణం. లాటిన్ అమెరికా ప్రాంతం శాంతి క్షేత్రంగా కొనసాగాలి. వెనెజులా తన భవిష్యత్తును తానే నిర్ణయించుకునే హక్కు కలిగి ఉంది” అని రష్యా స్పష్టం చేసింది. ఈ అంశంపై తక్షణమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలన్న వెనెజులా డిమాండ్‌కు రష్యా పూర్తి మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో క్యూబా అధ్యక్షుడు మిగ్యూల్ డియాజ్-కెనెల్ ఈ దాడిని “నేరపూరిత చర్య”గా అభివర్ణించారు. ఇది వెనెజులా ప్రజలపై జరుగుతున్న అగ్రరాజ్య ఉగ్రవాదమని ఆయన సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ కూడా అమెరికా చర్యను పిరికిపంద దాడిగా విమర్శించారు.
అమెరికా దాడిపై ఇరాన్ విదేశాంగ శాఖ కూడా ఘాటుగా స్పందించింది. ఇది స్పష్టమైన దురాక్రమణ చర్యగా పేర్కొంటూ, ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆరోపించింది. వెనెజులాకు తన సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా చేపట్టిన “దండయాత్రను” తక్షణమే నిలిపివేయాలని, ఇందుకు అంతర్జాతీయ సమాజం తన చట్టపరమైన, నైతిక బాధ్యతను నిర్వర్తించాలని ఇరాన్ పిలుపునిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వెనెజులా పరిస్థితి ఎలా మలుపు తిరుగుతుందన్నది, ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికా చర్యలు ప్రాంతీయ శాంతి, ప్రపంచ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న దానిపై అంతర్జాతీయ సమాజం కళ్లప్పగించి చూస్తోంది.
