Maldives -China : చైనాకు మాల్దీవుల అధ్యక్షుడి బిగ్ రిక్వెస్ట్.. ఏమిటో తెలుసా ?

Maldives -China : ఐదురోజుల చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 06:54 AM IST

Maldives -China : ఐదురోజుల చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మా మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగింది. ఈపరిణామంతో భారత టూరిస్టులు బుకింగ్స్‌ను రద్దు చేసుకున్నారు.  ఈనేపథ్యంలో మా దేశానికి ఎక్కువ మంది టూరిస్టులను పంపేందుకు మీరు(చైనా) సహకరించండి’’ అని డ్రాగన్‌కు విజ్ఞప్తి చేశారు.పర్యటనలో భాగంగా రెండో రోజు (మంగళవారం) ముయిజ్జు ఫుజియాన్ ప్రావిన్స్‌లోని మాల్దీవుల బిజినెస్ ఫోరమ్‌లో ప్రసంగిస్తూ.. చైనాను తమ ఆప్తమిత్రుడిగా అభివర్ణించారు. ‘‘చైనా మా సన్నిహిత మిత్రదేశాలలో ఒకటి. మా దేశ అభివృద్ధి భాగస్వాములలో ఒకటి’’ అని(Maldives -China) చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

2014లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (BRI) ప్రాజెక్టులను ముయిజ్జు ప్రశంసించారు. ఆ ప్రాజెక్టు మాల్దీవుల చరిత్రను మలుపు తిప్పే అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించిందని చెప్పారు. మాల్దీవులకు చైనా పర్యాటకుల ప్రవాహాన్ని పెంచాలని ఈసందర్భంగా ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ‘‘కరోనా సంక్షోభం కంటే ముందు మా దేశానికి వచ్చిన  టూరిస్టులలో అత్యధికులు చైనావాళ్లే. అదే స్థాయిలో మళ్లీ చైనీయులు మా దేశానికి రావాలని ఆశిస్తున్నాం’’ అని ముయిజ్జు చెప్పారు. చైనాతో 2014లో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) త్వరితగతిన అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. తన పర్యటనలో తదుపరిగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, ప్రీమియర్ లీ కే కియాంగ్‌లతో చర్చలు జరపాలని ముయిజ్జు భావిస్తున్నారు. మాల్దీవులలో ఇంటిగ్రేటెడ్ టూరిజం జోన్‌ను అభివృద్ధి చేయడానికి సంబంధించిన రూ.415 కోట్ల ప్రాజెక్టుపై ఈసందర్భంగా చైనా, మాల్దీవులు సంతకం చేశాయి.

Also Read: Formula E Race: ఫార్ములా ఇ రేస్ ఫెయిల్యూర్ ఈవెంట్: మల్లు భట్టి విక్రమార్క

మాల్దీవుల పర్యాటక శాఖ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. 2023లో మాల్దీవులకు భారతదేశం అతిపెద్ద పర్యాటక మార్కెట్‌గా మిగిలిపోయింది. గత ఏడాది మాల్దీవులకు అత్యధికంగా 209,198 మంది భారతీయులు వెళ్లారు. రష్యా నుంచి  209,146 మంది, చైనా నుంచి 187,118 మంది వెళ్లారు. ఇక 2022లో మాల్దీవులకు 240,000 మంది భారత పర్యాటకులు, 198,000 మంది రష్యా పర్యాటకులు, 177,000 మంది బ్రిటన్ పర్యాటకులు వెళ్లారు. 2019 సంవత్సరానికి ముందు చైనా నుంచి మాల్దీవులకు 2.80 లక్షల మంది టూరిస్టులు వెళ్లారు.