Site icon HashtagU Telugu

600Yrs Old Buddha Statue: ఎండిపోయిన జీవనదిలో 600 ఏళ్ల కిందటి బుద్ధుని విగ్రహం.. ఎక్కడ, ఏమిటి?

Budda

Budda

చైనాలో కరువు తీవ్రమైంది. దీంతో ఆ దేశంలోని 40 కోట్ల మందికి పైగా ప్రజలకు తాగునీటిని అందించే అతి పెద్ద జీవనది యాంగ్జీ పూర్తిగా ఎండిపోయింది. యాంగ్జీ నదికి డజన్లకొద్దీ ఉన్న ఉప నదులు ఎండిపోవడంతో రికార్డు స్థాయిలో కరువుకు కారణమైంది. ఈనేపథ్యంలో నదిలో మూడు ప్రాచీన బౌద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. వాటి రూపం ఆధారంగా అవి 600 ఏళ్ల నాటివని స్పష్టమవుతోంది. విగ్రహాలు బయటపడడాన్ని చైనాలో కొందరు శుభ శకునంగా భావిస్తున్నారు. అందమైన దేశం, శాంతియుత ప్రపంచం కోసమే పూర్వీకులు బౌద్ధ విగ్రహాలను నిర్మించి ఉంటారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

ఏం జరుగుతోంది?

చైనాలో కరువు ఏ స్థాయిలో ఉందంటే. డ్యామ్‌లు, రిజర్వాయర్లలో నీరు అడుగంటింది. దీంతో హైడ్రో పవర్‌ ప్లాంట్లు, ఫ్యాక్టరీలు తీవ్రమైన విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పలు ఫ్యాక్టరీలు విద్యుత్‌ కొరతతో మూతపడ్డాయి. కరువు కారణంగా పంటలు ఎండిపోతున్నాయి.

మరెన్నో బాధాకర ఘటనలు..

* గాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో ఎండల వేడిమిని కారణంగా చెరువుల్లో నీరు అడుగంటి చేపలు మృత్యువాత పడుతున్నాయి.

* చాంగ్‌క్వింగ్‌ ప్రావిన్స్‌లో 66 నదులు ఎండిపోయాయి.

* ఐదేళ్ల తరువాత యాంగ్జీ నది ప్రవాహం 50 శాతం దిగువకు పడిపోయింది. ఈ నది పరీవాహక ప్రాంతం లో 22 లక్షల ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది.

* దేశవ్యాప్తంగా 30 కోట్ల డాలర్ల మేర పంట నష్టం వాటిల్లినట్టు నివేదికలు చెబుతున్నాయి.

* 24 లక్షల 60 వేల మంది కరువు బారిన పడ్డారు.

* 7 లక్షల 80 వేల మంది ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

* చైనా వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 44 డిగ్రీలుగా నమోదువుతోంది.

మరెన్నో దేశాల్లో..

ఐరోపాలోని రైన్, లోయిర్‌ నది, అమెరికాలోని కొలరాడో నది పూర్తిగా ఎండిపోయాయి. ఐరోపాలో 500 ఏళ్ల తరువాత తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఐరోపా దేశాల్లో నదులను రవాణా మార్గాలుగా వినియోగిస్తారు. అక్కడి నదుల్లో ప్రవాహం రికార్డు స్థాయిలో తగ్గిపోవడంతో రవాణా పూర్తిగా ఆగిపోయింది.