Uk PM: బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్‌

బ్రిటన్‌ తదుపరి ప్రధానిగా ఎన్నికయ్యారు విదేశాంగశాఖ మాజీ మంత్రి లిజ్ ట్రస్‌. కన్జర్వేటీవ్‌ పార్టీ కొత్త నాయకుడి కోసం జరిగిన ఎన్నికల్లో భారత సంతతి నేత రిషి సునాక్‌పై విజయం సాధించారు.

  • Written By:
  • Updated On - September 6, 2022 / 07:52 AM IST

బ్రిటన్‌ తదుపరి ప్రధానిగా ఎన్నికయ్యారు విదేశాంగశాఖ మాజీ మంత్రి లిజ్ ట్రస్‌. కన్జర్వేటీవ్‌ పార్టీ కొత్త నాయకుడి కోసం జరిగిన ఎన్నికల్లో భారత సంతతి నేత రిషి సునాక్‌పై విజయం సాధించారు. ఎన్నికల్లో ట్రస్‌కు అనుకూలంగా 81వేల326మంది టోరీ సభ్యులు ఓటేశారు. రిషి సునాక్‌కు 60వేల399 ఓట్లు వచ్చాయి. 20వేల ఓట్ల ఆధిక్యంతో సునాక్‌పై గెలిచారు ట్రస్‌. కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక ప్రక్రియ ప్రారంభంలో రిషి సునాక్ ముందంజలో దూసుకెళ్లారు. ఎంపీల్లో ఎక్కువ మద్దతు ఆయనకే లభించింది. అయితే, పోలింగ్ మొదలైనప్పటి నుంచి ట్రస్‌కు ఆధిక్యం పెరుగుతూ వచ్చింది.

అధికారంలోకి వస్తే వెంటనే పన్నుల భారాన్ని తగ్గిస్తానని లిజ్ ట్రస్ హామీ ఇవ్వడమే దీనికి కారణంగా విశ్వేషిస్తున్నారు రాజకీయ పండితులు. హోరాహోరీగా సాగిన ప్రచారంలో ఇద్దరు నేతలు మంచి స్ఫూర్తితో ప్రచారాన్ని నిర్వహించారని కన్జర్వేటరీ పార్టీ ఛైర్మన్ ఆండ్రూ స్టీఫెన్సన్ పేర్కొన్నారు. పార్టీ సభ్యులు అడిగిన దాదాపు 600 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు. బోరిస్‌ వారసురాలిగా బ్రిటన్‌ ప్రధాని పగ్గాలు చేపట్టనున్నారు లిజ్‌. తనకు ఓటు వేసిన వారందిరికీ కృతజ్ఞతలు తెలిపారామె.

వచ్చే రెండేళ్లలో పన్నులు తగ్గించి ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడంతో పాటు.. ఇంధన సంక్షోభాన్ని పరిష్కరిస్తానన్నారు లిజ్‌. 1975లో ఆక్స్‌ఫర్డ్‌ వామపక్ష భావజాలం ఉన్న కుటుంబంలో లిజ్ ట్రస్ జన్మించారు. ఆమె తండ్రి లెక్కల ప్రొఫెసర్ కాగా.. తల్లి నర్స్. వారి కుటుంబం తర్వాత గ్లాస్గోకు వలస వెళ్లారు. ఆమె చిన్నప్పుడు తల్లితో కలిసి అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. పాఠశాల విద్యాభ్యాసం తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. విద్యార్థి రాజకీయాల్లో లిబరల్ డెమోక్రాట్ల తరపున చురుగ్గా పాల్గొన్నారు లిజ్‌. ఆ తర్వాత కన్జర్వేటీవ్ పార్టీకి మారారు. 2012లో విద్యాశాఖ మంత్రిగా, ఆ తర్వాత పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. బ్రిటన్ చరిత్రలో జరిగిన అత్యంత కీలకమైన బ్రెగ్జిట్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు లిజ్‌. ఐరోపా సమాఖ్యలో కొనసాగడానికే మొగ్గు చూపారు. అయితే.. బ్రెగ్జిట్‌కు బ్రిటన్‌లో ఆమోద ముద్రపడటంతో మనసు మార్చుకున్నారు. 019లో బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాక ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రటరీగా పనిచేశారు లిజ్‌. మరో రెండేళ్లకే బ్రిటన్ విదేశాంగశాఖ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. డిగ్రీ చదివిన తర్వాత కొంతకాలం అకౌంటెంట్‌గా పనిచేసిన లిజ్‌.. హ్యూ ఓ లియారీని వివాహం చేసుకున్నారు.

వీరికి ఇద్దరు సంతానం. కాగా బ్రిటన్‌ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమం రేపు జరుగుతుంది. బోరిస్ జాన్సన్‌ మంగళవారం తన వీడ్కోలు ప్రసంగం చేస్తారు. అంతకుముందే లాంఛనంగా తన రాజీనామాను రాణికి సమర్పిస్తారు. ఆ వెంటనే కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్‌ ట్రస్‌ను ప్రధానిగా నియమిస్తారు క్వీన్ ఎలిజబెత్‌-2. యూకే చరిత్రలో తొలిసారి ఇంగ్లండ్‌ వెలుపల.. ప్రధానమంత్రి నియామకం జరుగుతోంది. వెసవి విడిది కోసం రాణి స్కాట్లాండ్ క్యాసిల్‌లో ఉండడమే దీనికి కారణం. మంగళవారం సాయంత్రం కొత్త బ్రిటిష్‌ ప్రధాని లండన్‌లోని తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో తొలిసారి ప్రసంగిస్తారు. బుధవారం మధ్యాహ్నం కొత్త ప్రధాని.. హౌస్‌ ఆఫ్ కామన్స్‌లో ప్రతిపక్ష నేత నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటారు.