Hezbollah Vs Israel : ఇటీవలే లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలిన ఘటనలో దాదాపు 3200 మంది గాయాలపాలవగా, 32 మందికిపైగా చనిపోయారు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా యత్నించింది. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌లోని గూఢచార సంస్థ ‘మోసాద్’ ప్రధాన కార్యాలయం టార్గెట్‌గా ఖాదర్-1 మిస్సైల్‌ను ప్రయోగించింది. అయితే మార్గం మధ్యలోనే దీన్ని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చేసింది. ఈ మిస్సైల్ టెల్ అవీవ్ వైపుగా దూసుకెళ్తండగా ఓ విమానం దాని సమీపం నుంచి వెళ్లింది. ఒకవేళ ఆ విమానాన్ని మిస్సైల్ ఢీకొని ఉంటే.. భారీగా ప్రాణ నష్టం సంభవించి ఉండేది. ఈ మిస్సైల్ దాడి వివరాలను హిజ్బుల్లా కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని ఇరాన్‌ను హిజ్బుల్లా కోరింది. అయితే ఇది సరైన సమయం కాదని, తాము ఇప్పుడే ఇజ్రాయెల్‌పై దాడి చేయలేమని ఇరాన్(Hezbollah Vs Israel) తేల్చి చెప్పింది. ఇరాక్, సిరియా వైపు నుంచి సీ ఆఫ్ గలీల్ దిశగా తమ భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్లను కూల్చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది.
Also Read :Air Travel : 50 నిమిషాలు పెరగనున్న ఫ్లైట్ జర్నీ టైం.. ఎందుకు ?
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో తన అమెరికా పర్యటనను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమన్ నెతన్యాహు వాయిదా వేసుకున్నారు. లెబనాన్‌పై సైనిక చర్య పూర్తయ్యాక ఆయన అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం జరుగుతున్న సదస్సుకు కూడా నెతన్యాహూ గైర్హాజరయ్యారు. ఇదే సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. శాంతియుత చర్చలతోనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు. యుద్ధంతో ఏ సమస్యకు కూడా పరిష్కారం దొరకదన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి ఆయుధాల సప్లై కొనసాగుతోంది. ఆ ఆయుధాలతోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.