Nuclear Attack : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి దక్షిణ కొరియా, అమెరికాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ దేశాన్ని ఎవరైనా రెచ్చగొడితే.. అణ్వస్త్ర దాడి(Nuclear Attack) చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. గతవారం వాషింగ్టన్‌లో అమెరికా, దక్షిణ కొరియా దేశాల విదేశాంగ శాఖ, రక్షణ శాఖల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఉత్తర కొరియా అణ్వస్త్ర శక్తిని నిరోధించడం ఎలా అనే దానిపై చర్చించారు. ఈవిషయంపై అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈనేపథ్యంలోనే కిమ్ ఘాటుగా స్పందించారు. దక్షిణ కొరియా, అమెరికాలు అణుదాడి చేస్తామని కవ్విస్తే.. ప్రతిగా అణుదాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని కిమ్ తన మిలిటరీ క్షిపణి బ్యూరోను ఆదేశించారు. ఈమేరకు ఉత్తర కొరియా ప్రభుత్వానికి చెందిన ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ’ ఓ కథనాన్ని ప్రచురించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వార్నింగ్ నేపథ్యంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు స్పందించాయి. ‘‘మమ్మల్ని మరింత రెచ్చగొట్టడం ఇక ఆపేయండి. బేషరతుగా మాతో చర్చలు జరపడానికి ముందుకు రండి’’ అని కిమ్‌కు సూచించాయి. ఈ సంవత్సరం ఉత్తర కొరియా పెద్దసంఖ్యలో మిస్సైళ్లు, వివిధ ఆయుధాలను పరీక్షించింది. ఈనేపథ్యంలో ఆ దేశం పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్ అలర్ట్ అయ్యాయి. అవి అమెరికాతో కలిసి తమ దేశాల భద్రత కోసం చర్యలు మొదలుపెట్టాయి.
Also Read: Google Maps : న్యూ ఇయర్‌లో గూగుల్ మ్యాప్స్‌లో న్యూ ఫీచర్స్
గత వారం అమెరికాకు చెందిన ఒక అణు జలాంతర్గామి దక్షిణ కొరియాలోని బూసాన్ ఓడరేవుకు చేరుకుంది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేశాయి. ఈక్రమంలో తమ లాంగ్ రేంజ్ బాంబర్లను అమెరికా టెెస్ట్ చేసింది. ఈనేపథ్యంలో అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్-18ని ఉత్తర కొరియా సోమవారం రోజు ప్రయోగించింది. దీంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.