పాకిస్తాన్ లోని హైదరాబాద్ నగరానికి చెందిన 14ఏళ్ల హిందూ బాలిక అపహరణ కలకలం రేపింది. దీంతో పాకిస్తాన్ లోని సింధ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఇటీవల హైదరాబాద్‌లోని ఫతే చౌక్ నుంచి ఇంటికి వస్తుండగా బాలికను అపహరించినట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమె ఆచూకీ లభించలేదు.
ఈ ఘటనపై సింధ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. సీనియర్ పోలీసు అధికారులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని, బాధిత కుటుంబంతో టచ్‌లో ఉన్నారని సింధ్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. గత వారం రోజులుగా హైదరాబాద్, మిర్‌పుర్‌ఖాస్‌లో అదృశ్యమైన మరో ఇద్దరు హిందూ మహిళల ఘటనపై కూడా విచారణ జరుపుతున్నట్లు హైదరాబాద్‌లోని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
సింధ్ ప్రావిన్స్‌లో హిందూ బాలికలు, మహిళల అపహరణ, బలవంతపు మతమార్పిడి కేసులు ఈ సంవత్సరం గణనీయంగా పెరిగాయి. ఈ ఘటనలు పాకిస్థాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో పరువు తీశాయి. ఇటీవల ఓ ముస్లిం వ్యక్తి తనను కిడ్నాప్ చేసి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేసి పెళ్లి చేసుకున్నాడని ఓ బాలిక స్థానిక కోర్టుకు తెలిపింది. ఇటీవల జరిగిన మరో సంఘటనలో, ముస్లిం వ్యక్తి నుండి వివాహ ప్రతిపాదనను నిరాకరించినందుకు సుక్కూర్ పట్టణంలో ఒక యువతిని కాల్చి చంపారు.