UAE Golden Visa : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కొన్ని దేశాల పౌరులకు ‘లైఫ్‌టైమ్ గోల్డెన్ వీసా’ ఇస్తోందంటూ ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని అంతర్జాతీయ మీడియా వేదికలలో ప్రచారమవుతున్న సమాచారం అసత్యమని అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని, ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) గట్టిగా హెచ్చరించింది. ఈ మోసపూరిత ప్రచారాల వెనుక విదేశాల్లోని కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు మరియు మీడియా సంస్థలు ఉన్నట్లు ICP గుర్తించింది. గోల్డెన్ వీసా అనేది యూఏఈ ప్రభుత్వం విధించిన ఖచ్చితమైన అర్హత ప్రమాణాలు, విధానాల ప్రకారం మాత్రమే ఇస్తారు. ఎలాంటి ప్రైవేట్ ఏజెన్సీ లేదా కన్సల్టెన్సీకి గోల్డెన్ వీసాల కోసం దరఖాస్తులను స్వీకరించే అధికారం లేదని అధికారులు స్పష్టంగా తెలిపారు.
ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని, చట్టవిరుద్ధంగా వీసాల పేరుతో మోసాలు చేసే సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ICP వెల్లడించింది. కొంత డబ్బు చెల్లిస్తే చాలు, జీవితకాల గోల్డెన్ వీసా తేలికగా పొందవచ్చు’ అంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. ఇలాంటి ఆశాజనకమైన కానీ అసత్యమైన ప్రకటనలతో మోసపోవద్దని సూచించింది. గోల్డెన్ వీసా దరఖాస్తు చేయాలనుకునే వారు, కేవలం యూఏఈ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారానే దరఖాస్తు చేయాలని, దానికి సంబంధించిన సమాచారాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని ICP సూచించింది. అధికారిక సమాచారం కోసం www.icp.gov.ae వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని లేదా 600522222 నంబర్‌కు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
గోల్డెన్ వీసా అర్హతలు ఏమిటి?
యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా అర్హత కలిగిన విదేశీ పౌరులకు గోల్డెన్ వీసాలను మంజూరు చేస్తోంది. అయితే వాటికి ఖచ్చితమైన ప్రమాణాలు ఉన్నట్లు ICP వివరించింది.
. రియల్ ఎస్టేట్ రంగం: కనీసం 2 మిలియన్ దిర్హమ్స్ పెట్టుబడి పెట్టిన వారు.
. వ్యాపార రంగం: స్వంత వ్యాపారాన్ని నడుపుతున్న, ఆర్థికంగా . ప్రభావవంతమైన వ్యాపార యజమానులు.
. విజ్ఞాన, కళలు, క్రీడలు: సైన్స్, ఆర్ట్స్, స్పోర్ట్స్ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచినవారు.
. వైద్య, శాస్త్రీయ రంగం: వైద్యులు, శాస్త్రవేత్తలు వంటి అగ్రశ్రేణి నిపుణులు.
ఈ అర్హతల ఆధారంగా వచ్చే దరఖాస్తులను మాత్రమే ప్రభుత్వం పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో నామినేషన్ల ద్వారా వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలిస్తారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికల్లో, కొన్ని విదేశీ కన్సల్టెన్సీల ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో లైఫ్‌టైమ్ గోల్డెన్ వీసా అనే ప్రకటనలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. వీటిని నమ్మి దరఖాస్తు చేసే వారు మోసపోతున్నారు. ఆర్థికంగా, మానసికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి మోసాలను నివారించేందుకు యూఏఈ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. యూఏఈలో స్థిరపడాలనుకునే, పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీయులు ఖచ్చితంగా అధికారిక వేదికల ద్వారానే వీసాలకు దరఖాస్తు చేయాలని ICP స్పష్టం చేసింది. ప్రైవేట్ ఏజెన్సీలు చెప్పే ప్రకటనలు, హామీలపై నమ్మకం పెట్టకుండా, అధికారిక సమాచారం కోసం మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
Read Also: PM Modi : నమీబియాలో ప్రధాని మోడీ..ఆఫ్రికన్ దేశంలో మూడవ భారత ప్రధాని గౌరవం