Twitter: ట్విట్టర్ లో ఉద్యోగాల కోత.. ఆఫీసులు మూసివేత.!!

ట్విట్టర్ అధినేత మస్క్‌ చెప్పినట్టే చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 4, 2022 / 04:14 PM IST

ట్విట్టర్ అధినేత మస్క్‌ చెప్పినట్టే చేస్తున్నారు. ట్విట్టర్ పగ్గాలు చేపట్టాక వ్యయ తగ్గింపులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. సుమారు 3,700 మంది ఉద్యోగులకు తొలగింపు మెయిల్స్‌ పంపినట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోత ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆఫీసులు మూసివేయాలని నిర్ణయించారు. అటు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ఆప్షన్‌ను రద్దు చేసే యోచనలో మస్క్‌ ఉన్నట్లు సమాచారం. ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో కంపెనీ భవిష్యత్తుపై వారం రోజులుగా అనిశ్చితి నెలకొని ఉంది. ఉద్యోగులను తొలగించడం, తాత్కాలికంగా తన కార్యాలయాలను మూసివేయడం, సిబ్బంది యాక్సెస్‌ను నిరోధించడం వంటి వాటి గురించి ట్విట్టర్ ఉద్యోగులకు శుక్రవారం ఈ-మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది.

“ప్రతి ఉద్యోగి భద్రతతో పాటు ట్విట్టర్ సిస్టమ్‌లు, కస్టమర్ డేటాను నిర్ధారించడంలో సహాయపడటానికి” దాని కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయబడతాయని, అన్ని బ్యాడ్జ్ యాక్సెస్ లు నిలిపివేయబడతాయని ట్విట్టర్ పేర్కొంది. తొలగింపుల వల్ల ప్రభావితం కాని ట్విట్టర్ ఉద్యోగులకు వారి వర్క్ ఈ-మెయిల్ చిరునామాల ద్వారా తెలియజేయబడుతుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ తెలిపింది. తొలగించబడిన సిబ్బందికి తదుపరి దశల గురించి వారి వ్యక్తిగత ఈ-మెయిల్ చిరునామాలకు తెలియజేయబడుతుందని పేర్కొంది. మస్క్​ ట్విట్ట​ర్​ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఉద్యోగుల పరిహారం, వారి ప్రయోజనాలను ఏడాది పాటు కొనసాగించడానికి అంగీకరించారు. తొలగించిన తేదీ నుంచి.. రెండు నెలల జీతం, ఈక్విటీ నగదు విలువను ఉద్యోగులకు మూడు నెలల్లోగా మస్క్ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో ట్విట్టర్​లో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.