Site icon HashtagU Telugu

Jimmy Carter 100 : అలనాటి అమెరికా అధ్యక్షుడి వందేళ్ల బర్త్‌ డే.. జిమ్మీ కార్టర్ సెంచరీ

Jimmy Carter 100 Us President Min

Jimmy Carter 100 : అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఇవాళ 100వ బర్త్ ‌డేను జరుపు కుంటున్నారు. దీంతో నూరేళ్లు జీవించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ఆయన రికార్డును సొంతం చేసుకున్నారు. వాస్తవానికి ఆయన కెరీర్ వేరుశెనగ రైతుగా మొదలైంది. అనంతర కాలంలో అమెరికా రాజకీయాల్లో చక్రం తిప్పి  అధ్యక్షుడి స్థాయికి కార్టర్ ఎదిగారు. జార్జియా రాష్ట్రంలోని ప్లెయిన్స్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఇవాళ కార్టర్ బర్త్ డే వేడుకలు జరుపుకోబోతున్నారు. 1960వ దశకంలో జిమ్మీ కార్టర్, ఆయన భార్య దివంగత రోసాలిన్ కలిసి ఇక్కడి ఇంటిని కట్టించారు. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా దాదాపు 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి కార్టర్ లంచ్ చేయనున్నారు.  ఇక జిమ్మీ కార్టర్ తన ప్రియమైన స్నేహితుడని పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Jimmy Carter 100) ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈమేరకు ఒక వీడియో సందేశాన్ని ఆ పోస్ట్‌కు జతపరిచారు. జిమ్మీ కార్టర్ అత్యంత ప్రభావవంతమైన రాజనీతి కోవిదుడు అని బైడెన్ కొనియాడారు.  మనిషి మంచితనమే అన్నింటి కంటే ఉత్తమమైందని కార్టర్ చెప్పే నీతే తమ అందరినీ ముందుకు నడుపుతోందన్నారు.

Also Read :Iran Vs Israel : ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎటాక్.. భారతీయులకు భారత ఎంబసీ అడ్వైజరీ

ఈ సందర్భంగా అమెరికా వైట్ హౌస్‌లో ‘హ్యాపీ బర్త్‌డే ప్రెసిడెంట్ కార్టర్’ అనే సైన్‌ను ఏర్పాటుచేశారు.జార్జియా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జిమ్మీ కార్టర్ డేగా నిర్వహిస్తామని జార్జియా రాష్ట్ర గవర్నర్ బ్రియాన్ కెంప్ వెల్లడించారు. కార్టర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ బ్రిటన్ రాజు చార్లెస్-3 ఓ ప్రైవేటు మెసేజ్‌ను పంపారు. అమెరికా అధ్యక్షుడిగా కార్టర్ అందించిన సేవలు చాలా గొప్పవన్నారు. జిమ్మీ కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే (1978 సంవత్సరంలో) ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల మధ్య క్యాంప్ డేవిడ్ ఒప్పందం కుదిరింది. 1982లో కార్టర్ సెంటర్‌ను జిమ్మీ కార్టర్ ప్రారంభించారు. ప్రపంచ దేశాల దౌత్య సంబంధాలపై అధ్యయనం చేయడమే ఈ కేంద్రం ప్రత్యేకత.