Fligt Crash: నిన్నటికి నిన్న అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమానం ప్రమాదం యావత్తు ప్రపంచాన్నిఉలిక్కిపడేలా చేసింది. అయితే.. ఈ నేపథ్యంలో మరో విమానం ఘటన కలకలం రేపుతోంది. బోస్టన్‌లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 312 గురువారం ఉదయం ఒక ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. ఎయిర్‌బస్ A220 విమానం, చికాగో ఓ’హేర్ నుంచి బయలుదేరి ఉదయం 11:49 గంటలకు బోస్టన్‌లో ల్యాండ్ అయిన తర్వాత, రన్‌వే 33-L నుంచి టాక్సీవే వైపు మళ్లుతుండగా అదుపుతప్పి గడ్డి ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై మసాచుసెట్స్ పోర్ట్ అథారిటీ (మాస్‌పోర్ట్) స్పందిస్తూ, ఎటువంటి ప్రయాణికుడికి గాయాలు కాలేదని వెల్లడించింది. పైలట్ స్టీరింగ్ సమస్యను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలిపినట్లు సమాచారం.
ఈ సంఘటనపై అత్యవసర సిబ్బంది అప్రమత్తంగా స్పందించారు. అగ్నిమాపక వాహనాలు, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి బస్సుల ద్వారా టెర్మినల్‌కు తరలించారు. రన్‌వేను తాత్కాలికంగా మూసివేయగా, మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత తిరిగి తెరిచారు. ఈ సంఘటన విమానయాన కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపించింది. కొన్ని విమానాలు రద్దవ్వగా, ఇతర సర్వీసులు ఆలస్యం అయ్యాయి.
దర్యాప్తు విషయానికి వస్తే, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) కూడా ఈ దర్యాప్తులో భాగస్వామ్యం అవుతోంది. జెట్‌బ్లూ ఒక ప్రకటనలో, భద్రతే తమకు ప్రాధాన్యత అని పేర్కొంటూ, ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని స్పష్టం చేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సంఘటనకు నోస్ వీల్ స్టీరింగ్ వైఫల్యం లేదా ఎడమ బ్రేక్ లాక్ అయ్యుండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ సంఘటనపై సోషల్ మీడియా వేదికలపై తీవ్ర చర్చ సాగింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చినప్పటికీ, ఇటీవలి కాలంలో జరుగుతున్న విమాన ఘటనలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. విమానం గడ్డిపై ఆగిపోయిన దృశ్యాలు, రన్‌వేపై స్కిడ్ మార్కులతో కూడిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ సంఘటన భద్రతా ప్రమాణాలపై విమానయాన రంగంలో మరోసారి చర్చకు దారితీసింది.