Jeans Industry: జీన్స్ తో వాటికీ ముప్పే

ఫ్యాషన్‌ ప్రపంచంలో జీన్స్‌ (Jeans)కు ఉన్న క్రేజే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. మార్కెట్‌లో కొత్త పోకడలు, చౌక ధరల కారణంగా వీటి వినియోగం ఇంత ఎక్కువగా ఉంటోంది. ఇదంతా ఒక వైపు అయితే, ప్రజల మనసులను దోచుకోవడంలోనే కాదు.. వాతావరణ కాలుష్యంలోనూ జీన్స్‌ పరిశ్రమ తీసిపోవడంలేదు.

  • Written By:
  • Updated On - January 22, 2023 / 11:56 AM IST

ఫ్యాషన్‌ ప్రపంచంలో జీన్స్‌ (Jeans)కు ఉన్న క్రేజే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. మార్కెట్‌లో కొత్త పోకడలు, చౌక ధరల కారణంగా వీటి వినియోగం ఇంత ఎక్కువగా ఉంటోంది. ఇదంతా ఒక వైపు అయితే, ప్రజల మనసులను దోచుకోవడంలోనే కాదు.. వాతావరణ కాలుష్యంలోనూ జీన్స్‌ పరిశ్రమ తీసిపోవడంలేదు. సముద్ర జలాలను జీన్స్‌ విషతుల్యం చేస్తున్నామని నివేదికలు చెపుతున్నాయి.ఇలాగే కొనసాగితే సముద్ర జీవుల మనగడను జీన్స్‌ ప్రశ్నార్ధకం చేస్తాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

జీన్స్‌ పరిశ్రమ కారణంగా మహా సముద్రాలు సైతం కలుషితమవుతున్నాయి. దాదాపు అర మిలియన్‌ టన్నుల మైక్రోఫైబర్లు అంటే మూడు మిలియన్‌ బ్యారెళ్ల చమురుకు సమానమైన పొల్యూషన్‌ ఏటా సముద్రాల్లోకి చేరుతోంది. ఫలితంగా సాగర జలాలు విషపూరితంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో దుస్తుల్లో ఎక్కువగా వాడుతున్న సింథటిక్‌ పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్‌ పాలిమర్‌ రంగులను నీటిలో కడగడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇవి నీటిలో కుళ్లి నాశనం అవడానికి 200 ఏళ్లు పడుతుంది. దీనివల్ల జీన్స్‌లోని ప్లాస్టిక్‌ మైక్రోఫైబర్‌లు సముద్ర జలాలను కప్పేసినట్లు గుర్తించారు.

యూఎన్‌ నివేదికల ప్రకారం ఫ్యాషన్‌ పరిశ్రమ 20 శాతం కలుషిత నీరు, 10 శాతం కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తోంది. ఇది విమానాలు, సముద్ర రవాణా ద్వారా వెలువడే ఉద్గారాల (గ్రీన్‌హౌస్‌ వాయువులు) కంటే ఎక్కువగా ఉంటోంది. దేశంలోని భారతియార్‌ విశ్వవిద్యాలయంలో టెక్స్‌టైల్స్, దుస్తుల డిజైన్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అముత కరుప్పచామి విశ్లేషణ ప్రకారం.. పత్తిని అధికంగా ఉత్పత్తి చేసే చైనా, భారత్‌తో పాటు, అమెరికాలో కూడా రసాయనాలను విరివిగా వినియోగించడం కూడా నీటి కాలుష్యాన్ని పెంచుతోందని చెబుతున్నారు. సాధారణంగా.. దుస్తులన్నింటికీ అద్దకం, ఇతర ప్రక్రియల కోసం భారీగా మంచినీటిని ఉపయోగిస్తారు. ప్రతి టన్ను వ్రస్తానికి రంగు వేయడానికి దాదాపు 200 టన్నుల మంచినీరు అవసరం. ఇందులో ఒక జత బ్లూజీన్స్‌ తయారీకి 7,500 లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఇది సగటు వ్యక్తికి ఏడేళ్లపాటు అవసరమయ్యే తాగునీటితో సమానం.

Also Read: Diabetis : ఈ సంకేతాలు కనిపిస్తే బ్లడ్ షుగర్ డేంజరస్ లెవల్ లో ఉందని అర్ధం చేసుకోండి

అలాగే, యూఎన్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రకారం ఫ్యాషన్‌ పరిశ్రమ ఏటా 93 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని ఉపయోగిస్తుంది. ఈ నీటితో ఐదు లక్షల మంది జీవితకాల దాహార్తిని తీర్చవచ్చు. మరోవైపు.. దుస్తుల వినియోగంలోనూ మానవుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక ఏడాదిలో 5,300 మిలియన్‌ టన్నుల నూలు తయారవుతోంది. దీంతో ఏటా 80 బిలియన్ల కొత్త దుస్తులు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే యూఎన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ భాగస్వామి అయిన ఎల్లెన్‌ మకార్తుర్‌ ఫౌండేషన్‌ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు ఒక ట్రక్కులోడు వ్రస్తాలను చెత్తలో పడేస్తున్నారు లేదా కాల్చేస్తున్నారు.

నిపుణుల అంచనా ప్రకారం గడిచిన దశాబ్దంలో దుస్తుల ఉత్పత్తి రెట్టింపు అయింది. కానీ, వీటిలో 70 శాతం దుస్తులను ప్రజలు కొద్దిరోజులకే వాడిపడేస్తున్నారు. సగటున పాశ్చాత్య దేశాల్లో ఏడుసార్లు మాత్రమే ధరించి పడేస్తున్నారు. అదే ఇక్కడ ఒక కుటుంబం ఏటా 30 కిలోల దుస్తులను పడేస్తోంది. కొలరాడో పరిశోధన విశ్వవిద్యాలయం ప్రకారం.. కేవలం 15 శాతం దుస్తులను మాత్రమే రీసైకిల్‌ లేదా విరాళంగా అందిస్తున్నారు. ఇది మరింతగా పెరిగితే ఫ్యాషన్‌ పరిశ్రమ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.