1 Day – 155 Earthquakes : జనవరి 1న (సోమవారం) ఒక్కరోజే 155 భూకంపాలతో జపాన్ చిగురుటాకులా వణికిపోయింది. ఈ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. ఈవివరాలను జపాన్ వాతావరణ కార్యాలయం వెల్లడించింది. ఈ 155 భూకంపాలలో(1 Day – 155 Earthquakes).. చాలా భూకంపాలు 3 కంటే ఎక్కువ తీవ్రత కలిగినవేనని తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున కూడా జపాన్‌లో ఆరు బలమైన కుదుపులతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిసింది. హోన్షు ద్వీపంలోని ఇషికావా ప్రిఫెక్చర్ ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత 7.5గా నమోదైంది. సోమవారం అర్ధరాత్రి 1 గంటలకు కూడా ఇషికావా ప్రిఫెక్చర్‌లో 7.6 తీవ్రతతో మరో భారీ భూకంపం వచ్చిందని జపాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. జనవరి 1న జపాన్‌లో సంభవించిన మొత్తం 155 భూకంపాల్లో దాదాపు 90 ఇక్కడే చోటుచేసుకోవడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join.
సోమవారం రోజున సెంట్రల్ జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో దాదాపు ఎనిమిది మంది మరణించారు. మరెంతో మందికి గాయాలయ్యాయి. భూకంపం ప్రభావంతో మూడు అడుగుల ఎత్తున్న సముద్రపు అలలు తీర ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో తీరాల్లోని ఇళ్లకు నష్టం వాటిల్లింది. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. ఇంకొన్ని ఇళ్లు షార్ట్ సర్క్యూట్‌తో ఏర్పడిన మంటల్లో కాలిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. జనవరి 1న దాదాపు నాలుగు అడుగుల ఎత్తున్న అలలు వాజిమా నౌకాశ్రయాన్ని తాకాయి. మంగళవారం కూడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో వాజిమా ప్రాంతంలోని దాదాపు 32,700 ఇళ్లు అంధకారంలో చిక్కుకున్నాయి. సుజు ఫిషింగ్ పోర్ట్ వద్ద ఎన్నో పడవలు సముద్రంలో కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలోని దాదాపు 1,000 మంది సమీపంలోని సైనిక స్థావరంలో తలదాచుకుంటున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నీరు, ఆహారం, దుప్పట్లు, హీటింగ్ ఆయిల్, గ్యాసోలిన్, ఫ్యూయల్ ఆయిల్ వంటి సామాగ్రిని పంపిణీ చేస్తున్నామని జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా వెల్లడించారు.