ఇటీవల విమాన ప్రయాణాలు అంటే ప్రయాణికులు భయపడుతున్నారు. వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో చాలామంది విమానం అంటే వామ్మో అంటున్నారు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట విమాన ప్రమాదం అనే వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా చైనాలోని షాంఘై నుంచి జపాన్‌లోని టోక్యోకు వెళ్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం (Japan airlines flight) పెను ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుంది. బోయింగ్ 737 విమానం మెకానికల్ లోపంతో మిడ్-ఎయిర్‌లో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో కేవలం 10 నిమిషాల్లోనే దాదాపు 26,000 అడుగులు (సుమారు 8 కిలోమీటర్లు) కిందకు దిగజారి పోయింది. వెంటనే ఆక్సిజన్ మాస్క్‌లు విడుదల చేయడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. విమానంలో మొత్తం 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా, వెంటనే విమానం కెన్సాయ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Harish Rao: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా మారారు: హరీశ్ రావు
విమానం అంత తీవ్రమైన రీతిలో కిందపడడంతో చాలా మంది ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరైతే తమ చివరి మాటలు రాసుకొని, ఇన్సూరెన్స్, బ్యాంక్ పిన్ వివరాలు షేర్ చేయడం మొదలుపెట్టారు. “నా శరీరం కిందికి వచ్చేసింది కానీ, ఆత్మ మాత్రం ఇంకా ఎక్కడో ఉందిలే” అంటూ ఒక ప్రయాణికుడు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మరొకరు అయితే “విమానం సాయంత్రం 7 గంటల సమయంలో ఊహించని వేగంతో దిగడం ప్రారంభించింది. 20 నిమిషాల్లోనే అది 3,000 మీటర్లకు దిగిపోయింది” అని వివరించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రయాణికులకు జపాన్ ఎయిర్‌లైన్స్ రూ. 8,500 (15,000 యెన్) పరిహారం అందించి, ఒక రాత్రి వసతి కల్పించింది. ఈ ఘటన మరోసారి బోయింగ్ 737 విమానాల భద్రతపై అనేక ప్రశ్నలు రేపుతోంది. గతంలో కూడా ఇదే సిరీస్‌కి చెందిన జెజు ఎయిర్, చైనా ఈస్టర్న్ విమానాలు ఘోర ప్రమాదాలకు గురయ్యాయి.