Eu VS India : యూరప్ వార్నింగ్.. ఇండియా కౌంటర్.. ఎందుకంటే ?

ఇండియాకు యూరోపియన్ యూనియన్ (Eu VS India)  వార్నింగ్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - May 17, 2023 / 12:43 PM IST

ఇండియాకు యూరోపియన్ యూనియన్ (Eu VS India)  వార్నింగ్ ఇచ్చింది. రష్యాపై పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయని తెలిసి కూడా.. రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురును కొని శుద్ధి చేసి ఐరోపా దేశాలకు ఇండియా(Eu VS India) అమ్ముతోందని ఆరోపించింది. ఇందుకుగానూ భారత్‌పై చర్యలు తీసుకుంటామని యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ కామెంట్ చేశారు. భారత్ చమురు దిగుమతుల వల్లే రష్యా భారీ ఆదాయం ఆర్జించగలుగుతున్నదని చెప్పారు. ” రష్యా చమురు నుంచి భారతదేశం డీజిల్, గ్యాసోలిన్ ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. అది ఖచ్చితంగా ఆంక్షలను ఉల్లంఘించడమే అవుతుంది. దీనికి ఈయూ సభ్య దేశాలు పరిష్కారం కనుగొనాలి” అని ఆయన తెలిపారు. యూరప్‌కు రిఫైన్డ్ ఆయిల్‌ను విక్రయించే విషయంలో సౌదీ అరేబియాను కూడా భారత్ వెనక్కి నెట్టిందని గత నెలలో ఒక రిపోర్ట్ వచ్చింది. 15 నెలల క్రితం భారత్‌కు రష్యా ఒక శాతం కంటే తక్కువ ముడి చమురును ఎగుమతి చేసేదని, అదే రష్యా నేడు భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారిందని ఆ నివేదికలో ప్రస్తావించారు. ప్రస్తుతం భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 35 శాతం దాటిందని వెల్లడించింది. ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం మొదలైన తర్వాత భారతదేశం డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగాయని తెలిపింది. 2023 మార్చి లో భారతదేశం రోజుకు 1,60,000 బ్యారెళ్ల డీజిల్‌ను ఎగుమతి చేసింది.

also read : Ukraine : రష్యా దాడులతో ఉక్రెయిన్ లో ఇంధన సంక్షోభం.. కరెంట్ లేక చలిలోనే పాట్లు

రిఫైన్ చేసినంత మాత్రాన అది రష్యన్ ఇంధనం కాదు : జైశంకర్

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్వీడన్, బెల్జియం పర్యటనలో ఉన్న తరుణంలోనే యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జైశంకర్ ను నేరుగా ఈవిషయంపై నిలదీస్తానని జోసెప్ బోరెల్ చెప్పారు. యూరోపియన్ యూనియన్ ఫారిన్ పాలసీ చీఫ్ జోసెప్ బోరెల్ కామెంట్స్ పై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఘాటుగా స్పందించారు. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ రెగ్యులేషన్.. 833/2014 ని ఒకసారి చూసుకోవాలని హితవు పలికారు. రష్యన్ క్రూడ్ ని ఇండియా కొనుగోలు చేసి రిఫైన్ చేసినంత మాత్రాన దాన్ని రష్యన్ ఇంధనంగా పరిగణించరాదని తేల్చి చెప్పారు. రష్యాతో మా దేశ వాణిజ్యం చాలా తక్కువ స్థాయిలోనే ఉందని, యూరప్ దేశాలతో పోలిస్తే.. ఇది 12 నుంచి 13 బిలియన్ డాలర్ల మేరకేనని అన్నారు. ‘రష్యా ఫాసిల్ ఫ్యూయల్ ట్రాకర్’ అనే వెబ్ సైట్ ని మీరు చూడాలని, అది ఏ దేశం ఎంత ఇంధనాన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోందో స్పష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో తోడ్పడుతుందని సెటైర్ వేశారు.