Ivanka Trump: ఇవాంకా ట్రంప్ సంచలన నిర్ణయం.. రాజ‌కీయాలకు దూరం..!

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

  • Written By:
  • Updated On - November 16, 2022 / 01:51 PM IST

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ట్రంప్ ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుగా పనిచేసిన ఇవాంకా ఇకపై రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. 2024లో త‌న తండ్రి తరపున ప్ర‌చారంలోనూ పాల్గొన‌డం లేద‌ని ఆమె తెలిపారు.‌ 2024లో ప్రెసిడెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన కొన్నిగంట‌ల్లోనే రాజకీయాలకు దూరంగా ఉంటానని ఇవాంకా ప్రకటించడం గమనార్హం.

ఇవాంకా ట్రంప్ యుఎస్ రాజకీయాల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. 2024లో వైట్ హౌస్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తన తండ్రి చేస్తున్న ప్రయత్నంలో చేరకూడదని ఇవాంకా నిర్ణయించుకున్నారు. నా పిల్లల రక్షణ, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో రిపబ్లికన్ నామినేషన్ కోసం తన 2024 బిడ్‌ను ప్రారంభించారు. అతని భార్య మెలానియా, కుమారుడు ఎరిక్‌తో సహా అతని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్ కూడా హాజరయ్యారు. కానీ ఇవాంకా మాత్రం రాలేదు.

2024లో వైట్ హౌస్‌ను తిరిగి కైవసం చేసుకునేందుకు తన తండ్రి చేస్తున్న ప్రయత్నంలో నేను భాగస్వామినికానని, తన తండ్రి ప్రచారంలో అసలు జోక్యం చేసుకోనని స్పష్టం చేసింది. ఇవాంకా ట్రంప్ ఒక ప్రకటనలో ఇలా రాసుకొచ్చారు. నేను మా నాన్నను చాలా ప్రేమిస్తున్నాను. ఈ సమయంలో నేను నా పిల్లల రక్షణకు, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ నిర్ణయం ఎంచుకుంటున్నాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకు లేదని పేర్కొన్నారు. 2020లో ట్రంప్.. జో బైడెన్ చేతిలో ఓడిపోయినప్పటి నుండి ఇవాంకా ట్రంప్, ఆమె కుటుంబం ఫ్లోరిడాలోని ఖరీదైన భవనానికి మకాం మార్చారు.