Israel Vs Gaza : పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర దాడులు కొనసాగిస్తోంది. గత 48 గంటల వ్యవధిలో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 61 మంది సామాన్య పౌరులు చనిపోయారు. ఈ మరణాల వివరాల్లోకి వెళితే.. గాజాలోని జబాలియా పట్టణంలో ఉన్నహలీమా అల్-సాదియా పాఠశాల ప్రస్తుతం శరణార్థి శిబిరంగా ఉంది. యుద్ధం నేపథ్యంలో గాజాలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పాలస్తీనా ప్రజలు ఈ శిబిరంలోనే తలదాచుకుంటున్నారు. ఈ క్యాంపుపైకి ఇజ్రాయెల్ యుద్ద విమానాలు బాంబులు జారవిడిచాయి. దీంతో అందులో ఉన్న శరణార్ధుల్లో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. 15 మందికి గాయాలయ్యాయి. గాజా సిటీలోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ జరిగిన దాడిలో మరో ఐదుగురు చనిపోయారు.
Also Read :Aadhaar Card Applicants New Condition : ఆధార్ కార్డుకు అప్లై చేసేవారికి కొత్త కండీషన్ : అసోం సీఎం
గాజా ఆరోగ్య శాఖ ప్రకారం.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 40,900 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 23 లక్షల మంది ఇళ్లు విడిచి వలస వెళ్లాల్సి వచ్చింది. గాజా సరిహద్దులన్నీ ఇజ్రాయెల్ సీల్ చేసింది. ఆహార ట్రక్కులు, నీటి ట్రక్కులు గాజాలోకి వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో పాలస్తీనాలో ఆహార సంక్షోభం ఏర్పడింది. ఎంతోమంది ఆకలి కేకలతో చనిపోయారు. ఈవివరాలను ప్రపంచ ఆహార సంస్థ, ఐక్యరాజ్యసమితి కూడా గతంలో ప్రకటించాయి. ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధంపై ఇటీవలే ది హేగ్‌లో ఉన్న ప్రపంచ న్యాయస్థానం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయినా అమెరికా అండ చూసుకొని ఇజ్రాయెల్ రెచ్చిపోతోంది. అమాయక గాజా ప్రజలపైకి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే ఇజ్రాయెల్ – హమాస్ మధ్య సయోధ్య కుదరడంతో గాజాలోని పలు ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి సిబ్బంది పోలియో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఎంతోమంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. వాస్తవానికి ప్రస్తుత తరుణంలో గాజా ప్రజలకు కావాల్సిందే ఆహారం, నీరు, పారిశుధ్య నిర్వహణ. ఇవి మూడు సమకూరితే వారి ప్రాణాలు నిలుస్తాయి. ఇజ్రాయెల్‌కు(Israel Vs Gaza) అమెరికా నుంచి ఆయుధ సరఫరా ఆగితే.. యుద్ధానికి విరామం లభిస్తుంది.