Iran Attack : ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ బిలియనీర్‌కు చెందినదిగా భావిస్తున్న ఓ కంటైనర్ షిప్ (CMA CGM Symi) పై డ్రోన్ దాడి జరిగింది. ఈ పని ఇరాన్‌దే అయి ఉండొచ్చని అమెరికా రక్షణ శాఖ అధికార వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. మాల్టా దేశానికి చెందిన జెండాతో కూడిన నౌక హిందూ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల నుంచి వెళ్తుండగా షాహెద్-136 డ్రోన్ వచ్చి దాడికి పాల్పడింది. ఈ డ్రోన్ త్రిభుజం ఆకారంలో ఉంటుంది. బాంబులను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. డ్రోన్ పేలుడుతో ఓడకు నష్టం వాటిల్లింది. అయితే అందులోని సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
CMA CGM అనే షిప్పింగ్ కంపెనీ ఫ్రాన్స్‌లోని మార్సెయిల్ కేంద్రంగా పనిచేస్తుందని, ప్రస్తుతం దాడికి గురైన నౌక దానిదే అని తెలుస్తోంది. CMA CGM షిప్పింగ్ కంపెనీలో ఇజ్రాయెలీ సంతతికి చెందిన ఓ సంపన్నుడు వాటాలు కలిగి ఉన్నాడు. ఈ నౌక దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్ట్ నుంచి బయలుదేరిన తర్వాత దాని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) ట్రాకర్‌ను మంగళవారం రోజే స్విచ్ ఆఫ్ చేసుకుంది. వాస్తవానికి ఓడలు తమ AISను యాక్టివ్‌గా ఉంచుకోవాలి. కానీ నౌకపై ఇతరులు ఎవరైనా దాడి చేసే రిస్క్ ఉన్న టైంలో ఏఐఎస్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. యెమన్ హౌతీ మిలిటెంట్ల ముప్పు నేపథ్యంలో ఏఐఎస్‌ను ఆఫ్ చేసుకుంది. అయినప్పటికీ.. శుక్రవారం రోజు డ్రోన్ దాడి నుంచి నౌక తప్పించుకోలేకపోయింది. దీన్నిబట్టి ఏఐఎస్‌ను స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఒక్కటే నౌక సెక్యూరిటీకి సరిపోదని స్పష్టమైంది.