Israel Vs Yemen: యెమన్‌పై ఇజ్రాయెల్ దాడి.. ముగ్గురి మృతి, 80 మందికి గాయాలు

యెమన్ దేశంపై తొలిసారిగా ఇజ్రాయెల్ దాడి చేసింది.

  • Written By:
  • Publish Date - July 21, 2024 / 06:56 AM IST

Israel Vs Yemen: యెమన్ దేశంపై తొలిసారిగా ఇజ్రాయెల్ దాడి చేసింది. శనివారం అర్ధరాత్రి యెమన్‌లోని ఓడరేవు నగరం హుదైదా‌ సహా 25 వేర్వేరు ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో యెమన్‌లోని ముగ్గురు చనిపోయారు. దాదాపు 80 మందికిపైగా గాయాలయ్యాయి. యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో దాడి చేశామని ఇజ్రాయెల్ రక్షణశాఖ ప్రకటించింది. శుక్రవారం రోజు తమ దేశ రాజధాని టెల్ అవీవ్‌పై యెమన్ హౌతీలు డ్రోన్లతో దాడి చేసినందుకు ప్రతీకారంగానే ఈ దాడి చేశామని స్పష్టం చేసింది.   టెల్ అవీవ్‌‌పై హౌతీల డ్రోన్ దాడిలో ఒక వ్యక్తి చనిపోగా, 10 మందికి గాయాలయ్యాయని ఇజ్రాయెల్ తెలిపింది. “హౌతీలు మాపై 200 సార్లు దాడి చేశారు. వారు ఒక ఇజ్రాయెల్ పౌరుడి ప్రాణాలు తీశారు. అందుకే మేం వాళ్లపై దాడి చేశాం’’ అని ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గ్యాలెంట్ తెలిపారు. ఇరాన్ నుంచి యెమన్ హౌతీలకు ఆయుధాలు సరఫరా అయ్యే ఓడరేవుపై తాముదాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇజ్రాయెల్ సరిహద్దులకు దాదాపు 1,800 కి.మీదూరంలో జరిగిన ఈ దాడి.. ఇజ్రాయెల్(Israel Vs Yemen) చేరుకోలేని ప్రదేశమంటూ లేదని శత్రువులకు గుర్తుచేస్తోందని ఆయన చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

హౌతీ మిలిటెంట్లకు చెందిన అల్ మసీరా టీవీ కథనం ప్రకారం.. యెమన్‌లోని హుదైదా నగరంలో ఉన్న ముడి చమురు నిల్వ కేంద్రాలు, విద్యుత్ ప్లాంట్లపై ఇజ్రాయెల్  దాడి చేసింది. అందుకే వాటిపై యుద్ధ విమానాలు బాంబాలు జార విడవగానే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగానే ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇజ్రాయెల్ దాడులకు భయపడేది లేదని.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగే వరకు, తాము కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తూనే ఉంటామని యెమన్ హౌతీలు స్పష్టం చేశారు. ఈ దాడికి తగిన విధంగా స్పందిస్తామని హౌతీ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ ప్రకటించింది. హౌతీ ప్రతినిధి మహ్మద్ అబ్దెల్సలాం మాట్లాడుతూ..  గాజాకు మద్దతుగా పోరాడుతున్నందుకే యెమన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిందన్నారు.  ఇజ్రాయెల్‌లోని ముఖ్యమైన నగరాలపై మరిన్ని దాడులు చేసేందుకు తాము వెనుకాడబోమని తేల్చి చెప్పారు.

Also Read :Roasted Guava: ప‌చ్చి జామ‌కాయ కాదు తినాల్సింది.. కాల్చిన జామ‌కాయ ఒక‌సారైనా తినాల్సిందే..!

యెమన్‌పై ఇజ్రాయెల్ దాడిని పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఖండించింది.  యెమన్‌లో రేగిన మంటలు ఇజ్రాయెల్‌ను దహిస్తాయని పేర్కొంది. రానున్న రోజుల్లో పశ్చిమాసియాలో సమీకరణాలు మారుతాయని  ఆశాభావం వ్యక్తం చేసింది.  యెమన్ హౌతీలకు, యెమెన్ ప్రజలకు లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా కూడా మద్దతుగా నిలిచింది.  ఇజ్రాయెల్ తీసుకున్న ఈ తెలివితక్కువ నిర్ణయం.. ప్రాంతీయ ఘర్షణకు మరింత ఆజ్యం పోస్తుందని హెచ్చరించారు.

Follow us