Israel Vs Lebanon : లెబనాన్‌పై భూమార్గంలో దండయాత్రకు ఇజ్రాయెల్ ఆర్మీ రెడీ అయింది. ఇందుకు సిద్ధంగా ఉండాలని, ఇవాళ ఎప్పుడైనా భూతల దండయాత్ర మొదలయ్యే అవకాశం ఉందని ఇజ్రాయెలీ సైనికులకు ఆదేశాలు జారీ అయ్యాయి. తమ దేశంపై దాడి చేసేందుకు హిజ్బుల్లా మిలిటెంట్లు స్థావరాలుగా వాడుకుంటున్న లెబనాన్ గ్రామాలకు స్వేచ్ఛ కల్పించేందుకే ఈ దండయాత్ర చేయబోతున్నామని ఇజ్రాయెల్ అంటోంది. ఈమేరకు ఇజ్రాయెలీ ఆర్మీ చీఫ్ హెర్జీ హలేవీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇజ్రాయెల్‌పైకి లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగించి హిజ్బుల్లా బరితెగించింది. దానికి తగిన శాస్తి చేయాలి. అందుకే భూతల దండయాత్ర చేయక తప్పదు’’ అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థలు కూడా ఇజ్రాయెల్‌ను(Israel Vs Lebanon) ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నాయి. తమ దేశంలోకి ఇజ్రాయెల్ ఆర్మీ ప్రవేశించి పిక్నిక్ చేసేంత సానుకూల పరిస్థితులు ఉండవని ఓ మిలిటెంట్ సంస్థ నేత ప్రకటించాడు.
Also Read :Arka Arunika : అర్కా, అరుణిక సూపర్ కంప్యూటర్స్ రెడీ.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ
ఇజ్రాయెల్ ఆర్మీని ఎదుర్కొనేందుకు హిజ్బుల్లా, లెబనాన్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ ఆర్మీ ప్రవేశించగానే.. ఇజ్రాయెల్‌పైకి మరిన్ని హై రేంజ్ మిస్సైళ్లను హిజ్బుల్లా ప్రయోగించే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఈ యుద్ధం మరింత తీవ్రరూపు దాల్చనుంది. లెబనాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై పోరాడేందుకు ఇరాక్, సిరియా, యెమన్ దేశాలకు చెందిన దాదాపు 40వేల మంది మిలిటెంట్లు సిరియా సరిహద్దులకు చేరుకున్నారనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. అక్కడి నుంచి ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్ ప్రాంతంపైకి దాడులు జరగనున్నట్లు చెబుతున్నారు. ఇరాక్ నుంచి కొన్ని మిలిటెంట్ సంస్థలు ఇప్పటికే ఇజ్రాయెల్‌లోని కొన్ని ఓడరేవు పట్టణాలు లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తున్నాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ ఆర్మీ బలంగానే తిప్పికొడుతోంది.
Also Read : Walking Benefits: 150 సెకన్ల వాకింగ్-వర్కౌట్ సెషన్ అంటే ఏమిటి..?
లెబనాన్‌పై బుధవారం రోజు ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో 72 మంది చనిపోయారు. ఈవివరాలను లెబనాన్ ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో చనిపోయిన వారి సంఖ్య 620కి పెరిగింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల దాదాపు 5 లక్షల మందికిపైగా లెబనాన్ ప్రజలు నిరాశ్రయులయ్యారు.