Israel vs Palestine : యుద్ధ వార్తలలో నిజమెంత?

తాజాగా ఇజ్రాయిల్ పాలస్తీనా (Israel vs Palestine) మధ్య చెలరేగిన యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా మానవతావాదులను తీవ్రమైన మనస్తాపానికి గురిచేస్తోంది.

  • Written By:
  • Updated On - October 12, 2023 / 05:53 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Israel vs Palestine Conflict 2023 : నిజానికి.. అబద్ధానికి మధ్య విభజన రేఖను స్పష్టంగా చూడగలిగిన వాడే విజ్ఞుడు. అసలే ఇంటర్నెట్ యుగం. ఒక స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రపంచమంతా అరచేతిలో ఇమిడిపోయిన కాలం. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా, ఎవరు ఏం మాట్లాడినా క్షణాల్లో అది మన వద్దకు చేరుకుంటుంది. ఈ కోలాహలంలో అసలు నిజమేదో.. అబద్ధం ఏదో పోల్చుకోవడం కూడా చాలా కష్టంగానే మారింది. తాజాగా ఇజ్రాయిల్ పాలస్తీనా (Israel vs Palestine) మధ్య చెలరేగిన యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా మానవతావాదులను తీవ్రమైన మనస్తాపానికి గురిచేస్తోంది. దీనికి తోడు రోజురోజుకూ మీడియాలో వెలుగు చూస్తున్న యుద్ధ వార్తలు, దృశ్యాలు ప్రపంచాన్ని కలవరపరుస్తున్నాయి.

ఎవరికి తోచిన వార్తలను వారు, ఎవరికి తోచిన దృశ్యాలను వారు ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకుని కల్పిత రూపాలలో ప్రపంచం ముందు ప్రదర్శిస్తున్నారు. అందుకే కొన్ని కొన్ని వార్తలు, దృశ్యాలు మనకు కనిపించిన వెంటనే వాటిని నమ్మాలా వద్దా అనే సంశయం అందరికీ కలుగుతుంది. ఇజ్రాయిల్ (Israel) పై హమాస్ చేసిన దాడికి సంబంధించి అనేక వీడియోలు వెలుగు చూస్తున్నాయి. వీటిలో చాలావరకు కల్పితాలని రుజువు కూడా అవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇజ్రాయిల్ (Israel) పై హమాస్ దళాలు చేసిన దాడికి సంబంధించిన వార్తల్లో 40 మంది చిన్న పిల్లల తలలు నరికి పారేసిన వార్త ఒకటి ప్రపంచమంతా వైరల్ అయింది. ఈ వార్తను ఐ ట్వంటీ ఫోర్ న్యూస్ (i24news)వారి రిపోర్టర్ నికోలే జెడెక్ బయటపెట్టింది. దీనితో అన్ని దేశాల్లోనూ ప్రజలంతా కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు కంపించిపోయారు. మన భారత దేశంలో కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది. హమాస్ ఉగ్రవాదులు ఎంత దుర్మార్గంగా అమానవీయంగా పసిపిల్లల తలకాయలు నరికారని, మీడియా సంస్థలు సహజంగానే చర్చోపచర్చలు సాగించి ఆ అమానుష ఘటనను ఖండించడం ప్రారంభించాయి. కేవలం దేశ దేశాల మీడియా సంస్థలే కాదు.

ఈ వార్తను ఇజ్రాయిల్ (Israel) ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ అధికార ప్రతినిధి ఒకరు నిర్ధారణ చేశారు. అంతేకాదు, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా ఆ ఫోటోలను తాను చూసినట్టుగా చెప్పిన వార్త కూడా వైరల్ అయింది. అయితే తర్వాత వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు ఆ దృశ్యాలను బైడెన్ చూడలేదని, కేవలం వార్త మాత్రం ఆయన చెవికి చేరిందని తర్వాత స్పస్తీకరణ ఇచ్చారు. ఏది ఏమైనా 40 మంది పసిపిల్లల తలలు తెగనరికిన పాలస్తీనా (Palestine) హమాస్ టెర్రరిస్ట్ అటవిక చర్యలను ప్రపంచమంతా రెండు రోజులుగా ఖండిస్తూనే ఉంది.

వార్తలు ఇలా ఉంటే, ఇదంతా నిజం కాదని ఐ ట్వంటీ ఫోర్ న్యూస్ వారి రిపోర్టర్ చేసిన అభూత కల్పన అని, ఇదే నిజమైతే ఆమె ఆ దృశ్యాలను ఎందుకు ప్రపంచానికి చూపించలేదని అందరూ ప్రశ్నలు గుప్పించడం కూడా మొదలైంది. దీనికి ఆ రిపోర్టర్ సమాధానం చెబుతూ అంత దుర్మార్గమైన దారుణమైన ఘటనను కళ్ళారా చూడాలని అందరూ కోరుకుంటున్నారా, ఎంత దారుణం.. అని ఆమె ఎదురు దాడి చేసింది. తాను కళ్ళారా దృశ్యాలను చూశానని, ఇజ్రాయిల్ సైనికులతో తాను మాట్లాడానని, ఇజ్రాయిల్ సైనికులు తలలు తెగిపడిన ఆ పసిపిల్లల మృతదేహాలను వాహనాల్లోకి ఎక్కించి తీసుకువెళ్లిన దృశ్యాన్ని కూడా చూశానని, కడుపు తరుక్కుపోయే ఆ దృశ్యాలు ప్రపంచం చూడలేదని ఆ రిపోర్టర్ తనను తాను సమర్ధించుకుంది. అంతేగాని ఆ దృశ్యాలను చూపించడం లేదు. పైగా తాను చూసింది నిజం కాకుంటే మంచిదని కానీ తాను చూసింది నిజమని ఆమె చెబుతోంది.

భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ప్రపంచమంతా ఆ దృశ్యాలను వీక్షిస్తోంది. వీటికి తోడు మీడియాలో వెలుగు చూడని దృశ్యాలను కొందరు వీడియోల రూపంలో వైరల్ చేస్తున్నారు. కల్పిత వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు. గ్రాఫిక్ విజువల్స్ ను సృష్టించి ప్రసారం చేస్తున్నారు. ఎక్కువగా హమాస్ దళాలు చేసిన దాడికి సంబంధించినటువంటి వార్తలనే ఈ విధంగా వైరల్ చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి. దీని వెనుక ఇజ్రాయిల్ ప్రభుత్వము, వారి సైనికుల కుట్ర ఉందని, వారు కావాలని ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని పలువురు ఇండిపెండెంట్ జర్నలిస్టులు చెబుతున్న విషయం అందరినీ అయోమయానికి గురిచేస్తోంది.

జరిగింది ఎంతో ఘోర ఘటనే. కానీ మనం చూసేది తక్కువ, అంతకు వంద రెట్లు దుర్మార్గం జరిగిందని ప్రచారం చేయడానికి, పాలస్తీనా (Palestine) మీద తమ దాడులకు ఒక ఆధారాన్ని నిర్మించుకొని తమను తాము సమర్ధించుకోవడానికి ఇదంతా చేస్తున్నారని ఒకవైపు ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్ల యుగంలో, సోషల్ మీడియా విప్లవ కాలంలో కనిపిస్తున్నదంతా నిజమే అని నమ్మటానికి లేదు. ఏది అబద్దమో ఏది నిజమో తేల్చి చెప్పటానికి ఎవరి దగ్గరా సహేతుకమైన సాంకేతిక నైపుణ్యం ఉండదు.

కేవలం భావోద్వేగంలో కొట్టుకుపోవడమే తప్ప నిజ నిర్ధారణ చేసుకుని స్పందించే తీరుబడి కూడా ఎవరికీ లేదు. అందుకే ఒకటి కాదు, రెండు కాదు, అనేకానేక యుద్ధ వార్తలు వెలుగు చూస్తున్న ఈ తరుణంలో నిజాన్ని, అబద్ధాన్ని వేరు చేసి చూడగలిగే విజ్ఞతను పెంచుకోవాలి. అప్పుడే మనం ఏం జరుగుతుందో సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం.

Also Read:  KTR: సిరిసిల్లలో కేసీఆర్ బహిరంగ సభ, ఏర్పాట్లపై కేటీఆర్ సమీక్ష