Hamas Tunnels : గాజాలోని హమాస్ టన్నెల్స్ భరతం పట్టే కీలక ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ ఆర్మీ మొదలుపెట్టింది. హమాస్ టన్నెల్స్‌లోకి సముద్రపు నీటి విడుదలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ఆర్మీ గాజా సముద్ర తీరం నుంచి ఐదు భారీ పంపులను గాజా నగరంలోకి లాగింది. వాటి ద్వారా హమాస్ టన్నెల్స్‌లోకి సముద్రపు నీటిని పంపింగ్ చేస్తున్నారు. అన్ని హమాస్ సొరంగాల్లో నీటిని నింపే ప్రక్రియ పూర్తికావడానికి ఇంకొన్ని వారాల టైం పడుతుందని అంచనావేస్తున్నారు. సముద్రపు నీటి దెబ్బకు హమాస్ టన్నెల్స్‌లోని ఆయుధాగారాలు ధ్వంసమవుతాయని ఇజ్రాయెల్ ఆర్మీ అంచనా వేస్తోంది. ఈ సముద్రపు నీటివల్ల గాజాలోని నేల సారం దెబ్బతింటుంది. గాజాలోని మంచినీటి వనరులు కూడా దెబ్బతింటాయి. గాజా ప్రజలపై పడే ఈ నెగెటివ్ అంశాలను మాత్రం ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటివరకు హమాస్ టన్నెల్స్ నెట్ వర్క్‌ను(Hamas Tunnels) ధ్వంసం చేేసేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ బంకర్ విధ్వంసక బాంబులు, రసాయన ద్రవాలు, రోబోలు, డ్రోన్లను ప్రయోగించింది. అవన్నీ ఫెయిల్ కావడంతో చివరి ప్రయత్నంగా వాటిలోకి సముద్రపు నీటిని పంపుతోంది. గతంలో ఈజిప్టు కూడా గాజాపై ఇదే తరహా ఆపరేషన్ చేసింది. గాజా నుంచి ఈజిప్ట్‌లోకి సొరంగాలు ఉండేవి. 2015లో గాజా నుంచి ఈజిప్టు బార్డర్ వరకు ఉన్న సొరంగాలను ధ్వంసం చేసేందుకు వాటిలోకి సముద్రపు నీటిని ఈజిప్టు పంపింగ్ చేసింది. గాజా బార్డర్‌లోని సొరంగాల్లోకి భారీ పైపులతో సముద్రపు నీటిని పంప్ చేశారు. అయితే ఇజ్రాయెల్ ఒత్తిడి మేరకే అప్పట్లో ఈజిప్టు ఆ ఆపరేషన్ నిర్వహించింది.